శంకరపట్నంలో రెచ్చిపోతున్న దొంగలు

by Ajay Maddhiboyina |

శంకరపట్నం మండలంలో వరుస దొంగతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో ఓ కుటుంబం వారి అబ్బాయిని అమెరికా సాగనంపడానికి వెళ్లారు. ఆ రోజే అర్ధరాత్రి దొంగలు చోరీకి తెగబడ్డారు. నగదుతోపాటు బంగారు వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

శంకరపట్నంలో రెచ్చిపోతున్న దొంగలు
X

దిశ, శంకరపట్నం: శంకరపట్నం మండలంలో వరుస దొంగతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో ఓ కుటుంబం వారి అబ్బాయిని అమెరికా సాగనంపడానికి వెళ్లారు. ఆ రోజే అర్ధరాత్రి దొంగలు చోరీకి తెగబడ్డారు. నగదుతోపాటు బంగారు వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మెట్‌పల్లి గ్రామంలో ఓ కుటుంబం అంత్యక్రియలో పాల్గొని వచ్చేసరికి పట్టపగలే ఇంటి తాళాలను పగలగొట్టి లాప్ టాప్‌తోపాటుగా ఇన్వర్టర్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. కరీంపేట గ్రామంలో ఇద్దరు మెకానిక్‌లు రిపేరు చేసి ఇంటి ముందు భద్రపరిచిన నాలుగు వ్యవసాయ పంపుసెట్లను దోచుకెళ్లారు. మొలంగూరు శివారులో కిరాణంతోపాటుగా టీ స్టాల్ నడుపుతున్న ఓ చిరు హోటల్లో చోరీకి తెగబడ్డారు.

పశువులను ఎత్తుకెళ్తున్న వైనం...

ఇక పలు గ్రామాల్లో పశువుల చోరీకి అంతు లేకుండా పోతోంది. రాజాపూర్ గ్రామంలో ఓ రైతుకు చెందిన ఆవు, లేగ దూడను దొంగలు అపహరించుకుపోయారు. ఆముదాలపల్లి గ్రామంలో గొర్రెలకాపరులు చూస్తుండగానే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇరువురు వ్యక్తులు ఓ గొర్రెను ఎత్తుకెళ్లారు. కేశవపట్నం గ్రామంలో ఇంటి వద్ద ఉన్న గొర్రెల మందలో నుంచి నాలుగు గొర్రెలను రెండు రోజుల కింద ఎత్తుకెళ్లారు. కేశవపట్నం శివారులోని పెద్దమ్మగుడిలో చొరబడి అమ్మవారి రూ.లక్ష విలువ గల ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

నిద్రపోతున్న నిఘా వ్యవస్థ..

గతంలో ప్రతి గ్రామపంచాయతీ పరిధి కింద ప్రధాన రహదారుల వెంట నిఘా నేత్రాలు అమర్చి ఉండేవి. దీంతో పోలీసులకు చోరీ కేసులను ఛేదించడం సులువుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఏ గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతోపాటు కేశవపట్నం ప్రధాన రహదారిపై ఉన్న సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దీంతో దొంగలు దీనిని అవకాశంగా తీసుకుని రెచ్చిపోతున్నారు. మండలంలో దొంగతనం జరగని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదేమో. వెంటనే పెట్రోలింగ్ పెంచాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story