శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఒత్తిడితోనే ఉపాధ్యాయురాలి మృతి.!

by Ratna Kumari |

రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంతంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం కఠిన నిబంధనలు, మానసిక ఒత్తిళ్ల వల్లే ఒక అమాయక ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని ఏఐటీయూసీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ నాయకుడు ఎం.ఏ. గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ఆరోపించారు.

శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఒత్తిడితోనే ఉపాధ్యాయురాలి మృతి.!
X

దిశ, గోదావరిఖని : రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంతంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం కఠిన నిబంధనలు, మానసిక ఒత్తిళ్ల వల్లే ఒక అమాయక ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని ఏఐటీయూసీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ నాయకుడు ఎం.ఏ. గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ఆరోపించారు. ఈ ఘటనపై వారు చేసిన ఫిర్యాదుకు తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్.. పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ పాఠశాల యాజమాన్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల కంటే 20 నిమిషాల ముందే టీచర్లు బయోమెట్రిక్ హాజరు వేయాలని, ఆలస్యమైతే జీతాల్లో కోతలు విధిస్తామని యాజమాన్యం హుకుం జారీ చేసిందని వారు తెలిపారు. దీనికి తోడు ఉపాధ్యాయులకు కనీస బస్సు సౌకర్యం కల్పించకపోవడం, పాఠశాలకు వెళ్లే మార్గంలో రెండు వైపులా రైల్వే లైన్లు ఉండి తరుచూ గేట్లు పడటం, సరైన రహదారి లేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి చేరుకోవాలనే కంగారులో, తీవ్ర మానసిక ఒత్తిడితో వెళ్తూ ప్రమాదానికి గురై సదరు టీచర్ ప్రాణాలు కోల్పోయిందని, దీనికి పూర్తి బాధ్యత శ్రీ చైతన్య యాజమాన్యానిదేనని స్పష్టం చేశారు. అలాగే, ఎర్రటి ఎండల్లో మహిళా టీచర్లని కూడా చూడకుండా కొత్త అడ్మిషన్ల కోసం టార్గెట్లు పెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

ప్రశ్నిస్తే ఉద్యోగం తీసేస్తామని బెదిరింపులు..

హైదరాబాద్ కార్పొరేట్ స్థాయి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, ఉపాధ్యాయులకు మాత్రం అందులో 30–40 శాతం మాత్రమే జీతాలుగా ఇస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఈ అమానుషాలను ఎవరైనా ప్రశ్నిస్తే.. 'ఇష్టముంటే చేయండి, లేదంటే వెళ్లిపోండి' అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగంతో బతుకుదెరువు కోసం ప్రైవేట్ స్కూల్స్‌లో చేరుతున్న యువతను యాజమాన్యం నిరంకుశంగా అణచివేస్తుందని, ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న భయంతో టీచర్లు మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా కాకుండా, పారదర్శకంగా విచారణ చేపట్టి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం ఉపాధ్యాయులపై బెదిరింపులకు పాల్పడుతూ ఒంటెద్దు పోకడలు పోతే తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మద్దెల దినేష్, ఎం.ఏ. గౌస్ స్పష్టం చేశారు.

Next Story