పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలి

by Ratna Kumari |

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, మరో 10 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలి
X
దిశ, జగిత్యాల ప్రతినిధి : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, మరో 10 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి, అక్కడ కూడా త్వరితగతిన అన్‌లోడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పని చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 80 శాతం వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, 441 కొనుగోలు కేంద్రాల్లో 4.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా, 3.29 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడి కొనుగోలు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో జగిత్యాల జిల్లా 4వ స్థానంలో నిలిచిందన్నారు. అవసరమైతే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీతో పాటు ఇతర జిల్లాల గోదాములను వినియోగించాలని సూచించారు. కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ మిగిలిన ధాన్యం కొనుగోళ్లు కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. రోజుకు 30 నుంచి 35 వాహనాల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని, ప్రతి ఆరు గంటలకు ఒకసారి నివేదికలు తీసుకుంటూ పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ధాన్యం రవాణాకు 233 డీసీఎంలు, 862 లారీలు, 297 ట్రాక్టర్లు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్. లత, జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌరసరఫరాల డీఎం జితేంద్ర ప్రసాద్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Next Story