కూల్చివేతలు సాగేనా? ఆగేనా?

by Ratna Kumari |   (  Updated:2026-03-01 14:58:33  IST  )

శంకరపట్నం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరు కొందరికి మోదం ఇంకొందరికి ఖేదంగా మారిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కూల్చివేతలు సాగేనా? ఆగేనా?
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరు కొందరికి మోదం ఇంకొందరికి ఖేదంగా మారిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నూతన పంచాయతీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తరువాత అనుసరిస్తున్న విధానాలు కొంత వరకు అభివృద్ధికి బాటలు వేస్తున్నాయనే అభిప్రాయాన్ని ప్రజలు అంగీకరిస్తున్న మరి కొంతమంది వారి వ్యవహార శైలిని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం చేపట్టిన పురాతన ఇళ్ల‌ను ఆ ఇంటి యజమానుల సమ్మతితో కూల్చడం మొదలు పెట్టడంతో రహదారి వెడల్పు సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది.

కూల్చివేతలు సాగేనా? ఆగేనా?

తాతల కాలం నుంచి ఉన్న ఇరుకు రహదారిని వెడల్పు చేయాలని దశాబ్దాల కాలంగా పాలకులు ఆలోచనలు చేసిన రాజకీయ, వ్యక్తిగత కారణాలతో కార్యరూపం దాల్చలేదు. రోడ్డు వెడల్పు చేయడం ద్వారా ప్రజా రవాణాకు సౌకర్యంగా ఉంటుందని భావించిన పాలకవర్గం ఆ దిశగా మొదటి అడుగు వేసింది.కానీ రెండు వైపులా కూల్చివేతలు జరుగుతాయా అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు.పాలకవర్గం తీరు ఆరంభ శూరత్వమేనా అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటారా అనే ప్రశ్నలు ప్రజలు సంధిస్తున్నారు.

కూలిన ఇళ్ల‌ కూల్చివేత

రహదారికి ఇరువైపులా ఉన్న గృహ సముదాయాలు దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మించబడి శిథిలావస్థకు చేరుకున్నాయి.అవి నివాసానికి యోగ్యంగా లేకపోవడంతో గ్రామపంచాయతీ సూచనను అంగీకరించి ఆ ఇంటి యజమానులు స్వచ్ఛందంగా తమ ఇండ్ల కూల్చివేతకు అంగీకరించినట్లు తెలిపారు. దీనితో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించారు.

బడా బాబులు దారి కోసం దారికొచ్చేనా

రాజకీయంగా , ఆర్థికంగా పలుకుబడి కలిగి ఉన్న కొంతమంది బడా బాబుల గృహాలు కూడా రోడ్డు వెడల్పు కు అడ్డంగా ఉన్నాయి.మరి వాటి విషయంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఏ విధంగా ముందుకు వెళుతుందనే ఉత్కంఠ గ్రామ ప్రజల్లో నెలకొంది. అలాంటి వాటి కూల్చివేతకు గ్రామపంచాయతీ వెనకడుగు వేస్తే మిగతా వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందని అందరి పట్ల ఒకే రకంగా వ్యవహరించాలని పలువురు గ్రామస్తులు కోరారు.

నష్టాన్ని ఎవరు భరిస్తారు ?

పక్కా గృహాలు నిర్మించుకున్న వారికి చిన్న చిన్న గదులలో నివాసం ఉంటున్న వారికి గ్రామపంచాయతీ నిర్ణయం గుదిబండగా మారే అవకాశం ఉంది. ఒకవేళ తమ ఇండ్లను కూల్చిన తమకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉందని లేదంటే రోడ్డు వెడల్పు కు సహకరించమని నష్టపోతున్న వ్యక్తులు తెలియజేశారు.

Next Story