నరకప్రాయంగా మారిన ఊటూరు టూ పచ్చునూరు రోడ్డు

by Malleboina Mahesh |

నరకప్రాయంగా మారిన ఊటూరు టూ పచ్చునూరు రోడ్డు
X

దిశ, మానకొండూరు: ఊటూర్ గ్రామానికి అసలే మొక్కుబడిగా ఒకే ఒక్క ఆర్టీసీ బస్సు. అది కూడా గుంతల రోడ్డులో నరకయాతన చూపిస్తూ రాత్రి 11 గంటలకు గానీ గ్రామానికి చేరని పరిస్థితి. మరోవైపు అనుమతులు లేకుండా రోడ్డును ఆక్రమించి కిలోమీటర్ల మేర బారులు తీరిన ఇసుక లారీలు. ఇది ఊటూర్–పచ్చునూర్ గ్రామాల మధ్య ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న నరకప్రాయమైన దుస్థితి. అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సింగిల్ రోడ్డుపై ఇసుక లారీల రాజ్యం

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూర్ గ్రామం నుంచి పచ్చునూర్ వరకు ఉన్నది కేవలం ఒకే ఒక్క సింగిల్ రోడ్డు. ఈ రోడ్డుపై నిత్యం ఓవర్‌లోడ్‌తో వెళ్లే ఇసుక లారీల వల్ల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. చాలదన్నట్లు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర లారీలను రోడ్డుకు ఇరువైపులా పార్క్ చేయడంతో కనీసం ప్రజలు నడిచేందుకు కూడా దారి లేకుండా పోయింది. ఈ దారి గుండా ప్రతి రోజూ తెల్లవారుజామున 4:45 గంటలకే పనులకు వెళ్లే ప్రైవేటు ఉద్యోగులు, కూరగాయల వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ వ్యాన్లు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో చిన్నారులు ఆకలితో అలమటిస్తూ సాయంత్రం ఆలస్యంగా ఇళ్లకు చేరుకుంటున్నారు.

‘మమ్మల్ని రోడ్డుపైనే చంపేస్తారా’?

రాత్రి వేళల్లో రోడ్డుకు ఇరువైపులా లారీలు నిలిపివేయడంతో నిన్న రాత్రి ఊటూర్ గ్రామస్తులు లారీ డ్రైవర్లను నిలదీశారు. ‘మా ఇళ్లకు మేము ఎలా వెళ్లాలి?’ అని ప్రశ్నించగా, డ్రైవర్లు ఫోన్లలో ఎవరికో కాల్ చేస్తూ బెదిరింపులకు దిగారని గ్రామస్తులు వాపోయారు. గంటల తరబడి ప్రజలను రోడ్డుపైనే నిలబెట్టినా ఒక్క అధికారి కూడా ఘటనాస్థలానికి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కరీంనగర్ బస్సు నరక యాత్ర

గ్రామానికి వచ్చే ఏకైక ఆర్టీసీ బస్సు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. లారీల అడ్డంకుల వల్ల కొన్నిసార్లు బస్సు ఊటూర్‌కు రాకుండానే మధ్యలోనే వెనుదిరిగి వెళ్తోంది. నిన్న రాత్రి కరీంనగర్ నుంచి వేగురుపల్లి మీదుగా ఊటూర్‌కు వస్తున్న చివరి బస్సు వర్షం కారణంగా లోపల పూర్తిగా నీటితో నిండిపోయింది. వర్షంలో బస్సు కారుతుండగా, వేగురుపల్లి–ఊటూర్ మధ్య గుంతల రోడ్డుపై ప్రయాణికులు నీటిని తుడుచుకుంటూ రాత్రి 11 గంటలకు ఊటూర్ చేరుకున్నారు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

అధికారుల మౌనం... దేనికి సంకేతం?

చట్టాన్ని ఉల్లంఘిస్తూ రోడ్డుపై అక్రమంగా లారీలను పార్క్ చేస్తున్నా గ్రామ అధికారులు, పోలీసులు మౌనం పాటించడం వెనుక కారణమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చీకటి పడితే ఈ గుంతల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయి పలువురు కిందపడి గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్ కలగజేసుకోవాలి

‘ప్రజల కష్టాలు అధికారులకు ఆటపాట గా మారాయి. బస్సు లేదు... నడవడానికి దారి లేదు... నరకయాతన అనుభవిస్తున్నాం. గ్రామ అధికారుల నిర్లక్ష్యంపై, ఇసుక లారీల అక్రమ పార్కింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని ఊటూర్ గ్రామస్తులు, యువత హెచ్చరించారు.

Next Story