- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వచర్ల గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ఈగల బెడద..
కోళ్ల ఫామ్‌ల కారణంగా ఊరు విడిచిపోయే దుస్థితి ఏర్పడిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కల్వచర్ల గ్రామంలోని ప్రశాంత్ నగర్ వాసులకు పేరులోనే తప్ప, జీవితాల్లో ప్రశాంతత కరువైంది. ఎంతో ముచ్చటపడి సొంతిళ్లు కట్టుకున్న ఆ కాలనీ వాసులు.. ఇప్పుడు ఆ ఊళ్లోనే ఉండలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న తీవ్రమైన ఈగల బెడదే ఇందుకు ప్రధాన కారణం. మనిషి ఒక్క నిమిషం బయట నిలుచుంటే చాలు.. చుట్టూ వందలాది ఈగలు ముసురుకుంటున్నాయి. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఈగలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అన్నం తినాలన్నా, నిద్రపోవాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. 'ఎలుకల బెడద పడలేక ఇల్లు తగలబెట్టుకున్న చందంగా'.. కేవలం ఈ ఈగల బాధను తట్టుకోలేక, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను సైతం వదిలిపెట్టి ఊరు విడిచి వెళ్లిపోవాలనిపిస్తోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కారణం ఆ కోళ్ల ఫామ్‌లే..!
ఈ మహమ్మారికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్న కోళ్ల ఫామ్‌లే అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోళ్ల ఫామ్‌ల నిర్వాహకులు కనీస పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. ముఖ్యంగా చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టకుండా అలాగే వదిలేస్తుండటంతో.. ఆ దుర్గంధానికి, కుళ్లిపోయిన వ్యర్థాలకు ఈగలు విపరీతంగా వృద్ధి చెంది ఊరంతా వ్యాపిస్తున్నాయని మండిపడుతున్నారు. వ్యాధుల బారిన పడకముందే, సంబంధిత పారిశుధ్య, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు పాటించని కోళ్ల ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకొని, తమకు ఈ ఈగల బెడద నుంచి విముక్తి కల్పించాలని ప్రశాంత్ నగర్ వాసులు వేడుకుంటున్నారు.






