నీడనిచ్చే గూడు చెదిరింది.. బతుకు భారమైంది..

by Taduka Kalyani |

రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబంపై కాలం కన్నెర్ర చేసింది.

నీడనిచ్చే గూడు చెదిరింది.. బతుకు భారమైంది..
X

దిశ, చందుర్తి: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబంపై కాలం కన్నెర్ర చేసింది. గత వర్షాలకు సగం ఇల్లు కూలిపోగా దేవుడా నువ్వే దిక్కు అంటూ అదే ఇంట్లో కాలం వెళ్లదీశారు కానీ, పది రోజుల క్రితం ఉన్న ఇల్లు కాస్త కూడా కూలిపోయింది. బతుకు మరింత భారమవడంతో పాఠశాలే వారికి ఇళ్లయింది. వివరాల్లోకి వెళ్లితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం దేవుని తండా గ్రామపంచాయతీ పరిధి జలపతి తండాకి చెందిన గుగులోతు భూపతి చిన్నతనం నుంచే నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికంలో చిన్న తనం నుంచి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భూపతి చిన్న వయసులోనే 18సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయాడు. మూడు సంవత్సరాల క్రితం తల్లి బుజ్జవ్వను కోల్పోయాడు.

భూపతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో కురిసిన భారీ వర్షాలకు ఉన్న ఇల్లు సగభాగం కూలిపోగా ఏమీ చేయలేక దేవుని మీద భారమేసి అదే ఇంట్లో, ఇల్లుపై పరదాలు వేసి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని చెప్పుకుందాం అంటే ఏ ఒక్క అధికారి అటు వైపు వచ్చిన పాపాన పోలేదు. పలుమార్లు స్థానిక సర్పంచును సంప్రదించినా పట్టించుకోవడం లేదని సదురు బాధితుడు అవేదన వ్యక్తం చేశాడు. చేసేదేమి లేక అదే ఉంట్లో జీవనం కొనసాగిస్తుండగా పది రోజుల క్రితం ఉన్న ఇల్లు కాస్త నేలమట్టమయింది. ఇద్దరు చిన్న పిల్లలను, భార్యను పెట్టుకొని బతుకు జీవుడా అంటూ ఒక్కసారిగా రోడ్డున పడ్డ వాళ్ళ పరిస్థితిని చూస్తే స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. తిందం అంటే కనీసం నిత్యవసర సరుకులు కూడా ఇంట్లోనే ఉండిపోవడంతో అవి కాస్త మట్టిలో కలిసిపోయయని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎక్కడ ఉండాలో తెలియక తన భార్య, చిన్న పిల్లలను చేత పట్టుకొని భూపతి సాయం కోసం ఎదురు చూసి, జలపతి తండా ప్రాథమిక పాఠశాలకు చెందిన అదనపు గదిలో తలదాచుకుంటున్నారు. కడు పేదరికానికి ఆ పాఠశాలనే అతనికి ఇల్లు అయింది. భూపతి ట్రాక్టర్ డ్రైవర్ కావడంతో తన జీతం పోషణకే సరిపోతుంది. ఇక ఇల్లు ఎలా కట్టుకునేది అని వాపోయాడు. ఇంత జరిగినా కూడా స్థానిక సర్పంచి అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అధికారులు అయినా కనికరించలేదని బాధితుడు వాపోతున్నాడు. తన దీనస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా మండల అధికారులు గాని, జిల్లా అధికారులు స్పందించి భూపతికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Next Story