నారాయ‌ణ‌పూర్ ఘ‌ట‌న‌తో ఎమ్మెల్యేకు సంబంధం లేదు : మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్

by Ratna Kumari |   (  Updated:2026-05-31 12:56:40  IST  )

ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని, రైతుల పేరుతో చొప్పదండి నియోజకవర్గంలో ఆయన చిల్లర రాజకీయాలు చేస్తున్నారని గంగాధర మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్ మండిపడ్డారు.

నారాయ‌ణ‌పూర్ ఘ‌ట‌న‌తో ఎమ్మెల్యేకు సంబంధం లేదు : మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్
X

దిశ, గంగాధర : ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని, రైతుల పేరుతో చొప్పదండి నియోజకవర్గంలో ఆయన చిల్లర రాజకీయాలు చేస్తున్నారని గంగాధర మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్ మండిపడ్డారు. ఆదివారం గంగాధర ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపూర్ ఘటనతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రైతుల ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ, కొనుగోలు కేంద్రం నడిపిస్తున్న మహిళా నిర్వాహకురాలిపై దుర్భాషలాడి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినందుకే చట్టం తన పని తాను చేసుకుపోయిందని మంత్రి మహేందర్ స్పష్టం చేశారు. దీనికి రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటన్నారు. నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందని, పూడూరు, ఆర్నాకొండలో ధర్నా చేస్తే పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదని గుర్తు చేశారు.


గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వడ్లు కొనకపోతే ప్రశ్నించిన రైతులపై సంకెళ్లు వేసి జైలుకు పంపిన చరిత్రను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఎద్దేవా చేశారు. గతంలో సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించి, పోలీసుల చేత కొట్టించిన ఘన చరిత్ర మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ది అని ఆరోపించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ రైతుల ఇబ్బందులను తొలగిస్తూ, ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా సాగేలా చూస్తున్నారని తెలిపారు. రవిశంకర్ ఇప్పటికైనా చౌకబారు ఆరోపణలు మానుకోవాలని, లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ సమావేశంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story