మున్సిపల్, కార్పొరేషన్ లో టికెట్ల కోసం పోటాపోటీ

by Ratna Kumari |

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహులు టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

మున్సిపల్, కార్పొరేషన్ లో  టికెట్ల కోసం పోటాపోటీ
X

దిశ, కొత్త పల్లి : మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహులు టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు, ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో కలిసి వచ్చిన వారు తమకే పార్టీ టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ కోసం చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. పార్టీ టికెట్ వస్తే గెలుపు సులభం అవుతుందని భావిస్తున్న ఆశావహులు ఎలాగైనా టికెట్ సాధించాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీలోనూ టికెట్ల కోసం పలువురు పోటీ పడుతున్నారు. అయితే, ఆశావహుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను, వినతులను తీసుకుంటున్న నాయకులు గెలిచే వారికే టికెట్ ఉంటుందని, సర్వేల ఆధారంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం ఆశావాహుల మధ్య పోటా పోటీ నెలకొంది.

అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గోల..

అధికార కాంగ్రెస్ టికెట్ల గోల ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కో వార్డు కౌన్సిలర్ స్థానానికి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ వ్యవహారం ఆయా పార్టీల్లో కొంత గందరగోళానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా తాము బరిలో ఉంటామని, అవసరమైతే స్వతంత్రంగానైనా పోటీ చేయాలని యోచనలో ఆశావహులు ఉన్నారు. దీంతో ఈ పార్టీలకు రెబల్స్ బెడద పొంచి ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు ఎక్కువగా ఉన్న వార్డు లో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా పార్టీ ల క్యాడర్ లు రెండు, మూడు గ్రూపులుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ద్వారా ఖరారు గందరగోళానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. తమ వర్గానికి టికెట్లు దక్కించుకునేందుకు ఆయా నేతలు పట్టుబట్టే అవకాశం ఉండడంతో అధికార పార్టీ ఈ సమస్యను ఎలా అధిగమిస్తోందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే టికెట్లు ఖరారు కోసం ఆశావహుల నుంచి కాంగ్రెస్ వార్డుల భారీగా దరఖాస్తులు స్వీకరిస్తోంది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పార్టీ అధిష్టానం పరిశీలించి.. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీఆర్ఎస్ కసరత్తు..

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడం, క్యాబినెట్ సైతం ఎన్నికలకు ఓకే చెప్పడంతో ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోటీలో ఉండే అభ్యర్థుల కోసం కసరత్తు ప్రారంభించింది. గతంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆ పార్టీ అధికారంలో ఉండడంతో కార్పొరేషన్ ను ఆ పార్టీనే కైవసం చేసుకుంది. అయితే జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన సర్పంచ్ స్థానాలను గెలుచుకోనప్పటికీ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.ఆయా మునిసిపాలిటీల్లోని అన్ని వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చిన పలువురు అభ్యర్థులు స్థానికంగా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఆశ్రయిస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలు , కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్న కొందరు ఆశావహులు బీజేపీ వైపు కూడా చూస్తున్నారు. ఒకవేళ అక్కడ టికెట్లు దక్కకపోతే బీజేపీ టికెట్ కోసం ముందు జాగ్రత్తగా ఆ పార్టీ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో కొన్ని వార్డుల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులే బీజేపీకి కరువవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్ దక్కని పక్షంలో తమకు టికెట్ ఇస్తే ఎన్నికల ఖర్చు పెట్టుకుంటామని కొందరు ఆశావహులు ముందస్తుగా బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తుండడం.. ఆ పార్టీ వర్గాల్లో అంతర్గత కలహాలకు తావిస్తోంది. మొత్తం మీద మూడు ప్రధాన పార్టీల్లో టికెట్ల కోసం పోటాపోటీ నెలకొంటుండడంతో.. కార్పొరేషన్ లో రాజకీయం వేడెక్కుతోంది.

Next Story