- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి ఫైల్‌కు ఒక రేటు..?
ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయంలో దస్తావేజు బ్రోకర్ల హవా కొనసాగుతోందనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి.

దిశ, ఇల్లంతకుంట: ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించాల్సిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయంలో దస్తావేజు బ్రోకర్ల హవా కొనసాగుతోందనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి. కార్యాలయంలోకి అడుగు పెట్టిన సామాన్యుడికి ఒక నిబంధన, దస్తావేజు బ్రోకర్లతో వచ్చిన వారికి మరో నిబంధన అమలవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి ఫైల్‌కు ఒక రేటు నిర్ణయించి మధ్యవర్తుల ద్వారానే పనులు వేగంగా పూర్తవుతున్నాయని, నేరుగా వచ్చిన ప్రజలు మాత్రం కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
స్వతహాగా వస్తే ముప్పుతిప్పలు
రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం కల్పించిన విధానంలో బయటే స్లాట్ బుక్ చేసుకుని వచ్చిన వారి ఫైళ్లను ‘ఈ పత్రం లేదు ,‘ఆ పత్రం లేదు.’, ‘రేపు రండి’,‘ఇంకోసారి రండి’ అంటూ పదేపదే వెనక్కి పంపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అదే ఫైల్ దస్తావేజు బ్రోకర్ల ద్వారా వెళ్తే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తక్కువ సమయంలోనే పూర్తవుతోందని పలువురు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయం ప్రజల కోసమా, లేక మధ్యవర్తుల కోసమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పాస్‌బుక్ లేకుంటే ఐదువేల డిమాండ్?
పట్టా పాస్‌బుక్ లేని భూముల వ్యవహారాల్లో రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విరాసత్ (వారసత్వ) ఫైళ్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని బాధితులు పేర్కొంటున్నారు. ఏ పని అయినా ఫైల్ స్వభావాన్ని బట్టి వేర్వేరు రేట్లు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.సామాన్య ప్రజలు ఉదయం కార్యాలయానికి వచ్చి సాయంత్రం వరకు వేచి చూసినా అధికారులు అందుబాటులో లేరనే సమాధానాలు మాత్రమే వినాల్సి వస్తోందని, పలుమార్లు తిరిగినా పని పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే దస్తావేజు బ్రోకర్లతో వచ్చిన వారు నేరుగా లోపలికి వెళ్లి కొద్ది సేపట్లోనే పని పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో కార్యాలయంలో ప్రజల కంటే బ్రోకర్లకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చర్యలు తీసుకున్నా..మారని వైనం
ఈ వ్యవహారంపై గతంలో పలు వార్తలు వెలువడినా పరిస్థితిలో మార్పు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఒక తహశీల్దార్ కొందరు దస్తావేజు బ్రోకర్లపై బైండోవర్ చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపిస్తున్నారు. మధ్యవర్తుల ప్రభావం ఏమాత్రం తగ్గలేదని, కార్యాలయ వ్యవస్థపై వారిదే పైచేయిగా కనిపిస్తోందని ప్రజలు వాపోతున్నారు.
మమ్మల్ని ఏం చేయలేరు?
కొందరు దస్తావేజు బ్రోకర్లు ‘మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, మా గురించి ఎన్ని వార్తలు వచ్చినా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని ధీమాగా మాట్లాడుతున్నట్లు సమాచారం. అలాగే ‘మాకు రాజకీయ నాయకుల అండ ఉంది అని కూడా చెబుతున్నట్లు కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనే విషయంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.
నష్టపోతున్న సామాన్య ప్రజలు
ప్రభుత్వం అవినీతి రహిత పాలన, పారదర్శక సేవలపై దృష్టి సారిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మధ్యవర్తుల జోక్యం వల్ల సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారని, ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతోందని పేర్కొంటున్నారు. దస్తావేజు బ్రోకర్ల వ్యవస్థపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక బృందంతో విచారణ జరిపి, కార్యాలయంలోని సీసీటీవీ దృశ్యాలు, ఫైళ్ల నిర్వహణ విధానం, ప్రజల ఫిర్యాదులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవం తేలితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సామాన్య ప్రజలకు ఎలాంటి మధ్యవర్తుల అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.






