​ఉద్యమకారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 'కేకే కమిటీ' ఏర్పాటు అభినందనీయం

by Kodari Anjali |

​జూన్ 28న ఇందిరా పార్క్ వేదికగా జరిగే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండని ​తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు.

​ఉద్యమకారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేకే కమిటీ ఏర్పాటు అభినందనీయం
X

దిశ, ​హుజురాబాద్ రూరల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడిన ఉద్యమకారుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కార మార్గాలను సూచించేందుకు ప్రభుత్వం 'కేకే కమిటీ' ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డా. చెల్పూర్ మధు కొనియాడారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వేదికగా జూన్ 28న సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న "తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హుజురాబాద్, మానకొండూర్ నియోజకవర్గాలకు చెందిన ఉద్యమకారులతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి, సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

​ప్రభుత్వానికి డిమాండ్లు..

​ప్రతి అర్హత కలిగిన తెలంగాణ ఉద్యమకారుడికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని, ఉద్యమకారులకు గౌరవ పెన్షన్, ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రాధాన్యత క్రమంలో అందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని కోరారు.

​సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు కృతజ్ఞతలు...

​ఉద్యమకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి కేకే కమిటీని ఏర్పాటు చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి, పొన్నం ప్రభాకర్‌కి తెలంగాణ ఉద్యమకారుల తరఫున డా. చెల్పూర్ మధు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ​జూన్ 28న ఇందిరా పార్క్‌లో జరిగే మహా సమ్మేళనానికి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ భారీ సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మేళనం ద్వారా ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయమైన హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హుజురాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల ముఖ్య నాయకులు జి సతీష్, వేల్పుల ప్రభాకర్, మల్లేశం, రాజేంద్ర, ఉద్యమకారులు పాల్గొన్నారు.

Next Story