ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి

by velandi.Saikiran |

సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు.

ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌.ఐ.ఆర్‌) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని, రాష్ట్రవ్యాప్తంగా రేపటిలోగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్లకు వెళ్లిన సమయంలో తాళం వేసి ఉంటే వాటిని 'అబ్సెంట్'గా నమోదు చేయాలని, అవసరమైతే తర్వాత మరోసారి సందర్శించి ఫారాలను అందజేయాలని సూచించారు.పంపిణీ చేసిన ప్రతి ఎన్యుమరేషన్ ఫారాన్ని బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) తిరిగి సేకరించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా డిజిటలైజేషన్ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం అందిస్తే RPI Act section 31 ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాన్ని ఎలా పూరించాలో వివరించడంలో ఇబ్బంది పడుతున్న బీఎల్‌వోలకు సూపర్‌వైజర్లు సహకరించాలని, ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌వోలు) సూపర్‌వైజర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన చోట అనుభవం ఉన్న వాలంటీర్లను నియమించి బీఎల్‌వోలకు సహకారం అందించాలని తెలిపారు. ప్రతి ఓటరికి ఒక ఎన్యుమరేషన్ ఫారాన్ని అందజేసి, పూరించిన ఫారాన్ని మాత్రమే తిరిగి తీసుకోవాలని, రెండు ఫారాలను ఒకేసారి తిరిగి తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయని, అలాంటి విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుసరించరాదని స్పష్టం చేశారు. పూరించిన ఎన్యుమరేషన్ ఫారాలపై తప్పనిసరిగా ఓటర్ల సంతకాలు ఉండేలా చూడాలని ఆదేశించారు.

ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు మాత్రమే పంపిణీ చేయాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులు లేదా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ఫారాలను పంపిణీ చేయరాదని స్పష్టం చేశారు. అయితే ఓటర్ల చిరునామాలను గుర్తించడంలో మాత్రమే బీఎల్‌ఏలు బీఎల్‌వోలకు సహకరించవచ్చని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశించిన గడువుల్లో పూర్తి చేయాలని, అదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story