- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌన్సిలరే పారిశుద్ధ్య కార్మికుడై...!
ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ఓ ప్రజాప్రతినిధి స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడి పాత్ర పోషించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశమైంది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల..: ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ఓ ప్రజాప్రతినిధి స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడి పాత్ర పోషించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశమైంది. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, తన వార్డులో పేరుకుపోయిన మురికి కాలువలను స్వయంగా బుధవారం శుభ్రం చేస్తూ ఏడో వార్డు కౌన్సిలర్ ఎర్రం వెంకటరాజం ఆదర్శంగా నిలిచారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని తన వార్డులో మురికి కాలువలు రోజుల తరబడి శుభ్రం కాకపోవడంతో దుర్వాసన, దోమల బెడద, మురుగునీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో చివరకు తానే రంగంలోకి దిగారు. చేతికి పనిముట్లు పట్టుకుని సుమారు గంటసేపు శ్రమించి కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మురికిని తొలగించి నీటి ప్రవాహాన్ని సక్రమంగా జరిగేలా చేశారు. ఈ ఘటనను అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు "ప్రజా ప్రతినిధి అంటే ఇలానే ఉండాలి", "ఫిర్యాదులతో కాలక్షేపం చేయకుండా ప్రజల సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించేందుకు ముందుకు రావడం అభినందనీయం" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటరాజం మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో తన వార్డును పరిశుభ్రంగా ఉంచుతానని ప్రజలకు హామీ ఇచ్చానని, ఆ మాట నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావించి స్వయంగా కాలువ శుభ్రం చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటమే తన లక్ష్యమని, అవసరమైతే భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేయడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటనతో సిరిసిల్ల మున్సిపల్ పారిశుద్ధ్య వ్యవస్థ పనితీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధే స్వయంగా కాలువలు శుభ్రం చేయాల్సిన పరిస్థితి రావడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






