- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా వరల్డ్ కప్ నుంచి అర్జెంటీనాను తొలగించాలి.. వెల్లువెత్తుతున్న నిరసనలు
అర్జెంటీనా జట్టును ఫిఫా వరల్డ్ కప్ నుంచి తొలగించాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : అర్జెంటీనా జట్టును ఫిఫా వరల్డ్ కప్ నుంచి తొలగించాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో 75 లక్షలకు పైగా సంతకాల సేకరణ జరగడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అర్జెంటీనా జట్టు సాధించిన విజయాల పట్ల వ్యతిరేకత, మ్యాచ్‌ల సమయంలో రిఫరీలు తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలే దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ 16 దశలో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక పెనాల్టీ నిర్ణయంపై, ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్‌సైడ్ వివాదంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. అర్జెంటీనా జట్టుకు అనుకూలంగా రిఫరీలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, టోర్నమెంట్‌లో వారిని ముందుకు తీసుకెళ్లడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రత్యర్థి జట్ల అభిమానులు ఆరోపించారు.
ఈ క్రమంలోనే https://argentinaout.com/ అనే ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా అర్జెంటీనాను 2026 ఫిఫా ప్రపంచ కప్ నుండి తక్షణమే బహిష్కరించాలంటూ సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ పిటిషన్ ఊహించని రీతిలో వేగంగా వైరల్ అయి, ఏకంగా 75 లక్షల మందికి పైగా సంతకాలు చేయడంతో ఇది కేవలం ఒక ఆన్‌లైన్ నిరసనగా మిగిలిపోకుండా, అంతర్జాతీయ క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక పెద్ద వివాదంగా మారింది. అయితే, క్రీడా నిబంధనలు, ఫిఫా (FIFA) నియమాల ప్రకారం ఇలాంటి ప్రజా పిటిషన్లకు ఎలాంటి చట్టపరమైన అర్హత లేదా అధికారిక విలువ ఉండదు. మైదానంలో రిఫరీల నిర్ణయాలే అంతిమమైనవని, వాటిని కేవలం సోషల్ మీడియా నిరసనలు ఆధారంగా మార్చడం, ఒక జట్టును టోర్నమెంట్ నుండి తొలగించడం అసాధ్యమని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ఆరోపణలను అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని పూర్తిగా తోసిపుచ్చారు. టెక్నాలజీ (VAR) ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో ఒక జట్టుకు పక్షపాతంగా వ్యవహరించడం సాధ్యం కాదని, మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ వల్లే తాము సెమీస్ చేరామని వారు వాదిస్తున్నారు. ఇక ఇప్పటికే ఫిఫా వరల్డ్ కప్ లో స్పెయిన్ ఫైనల్ కు చేరగా.. ఇంగ్లాండ్‌తో జరగబోయే కీలకమైన సెమీ-ఫైనల్ పోరుకు అర్జెంటీనా సిద్ధమవుతోంది. ఇందులో గెలిస్తే ఫైనల్ లో స్పెయిన్, అర్జెంటీనా జట్లు కప్ కోసం తలపడనున్నాయి.






