- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబీఆర్ పార్క్ చుట్టూ త్వరలో ‘వన్ వే’.. కాలినడకన సీపీ సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ పరిశీలన
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత చెక్ పెట్టేందుకు ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత చెక్ పెట్టేందుకు ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ఇక్కడ ప్రతిపాదించిన వన్‌వే విధానాన్ని త్వరలోనే పక్కాగా అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
కాలినడకన 5 కిలోమీటర్ల పర్యటన
ఉదయం 7 నుంచి 9 గంటల వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర అధికారులు కాలినడకన పర్యటించారు. అగ్రసేన్ కూడలి, ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం తదితర కీలక ప్రాంతాల్లోని ట్రాఫిక్ సరళిని పరిశీలించారు. ఇటీవల చేపట్టిన ‘వన్‌వే’ ట్రయల్ రన్‌లో తలెత్తిన సమస్యలపై చర్చించిన అధికారులు.. రద్దీకి కారణమవుతున్న ఇరుకు రహదారులను తక్షణమే విస్తరించాలని సిబ్బందిని ఆదేశించారు.
పాదచారుల భద్రతకే పెద్దపీట
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్నపాటి సివిల్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా పాదచారుల భద్రత కోసం తగిన చోట్ల లేన్ మార్కింగ్‌లు, పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసుల సూచనల మేరకు సివిల్ పనులను త్వరగా పూర్తి చేసి, ట్రాఫిక్ కష్టాలు లేకుండా వన్‌వే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని కమిషనర్ ఆర్.వి.కర్ణన్ స్పష్టం చేశారు. ప్రజలు సైతం ఈ పనులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి.జోయల్ డెవిస్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్, డీసీపీ కాజల్ తదితర అధికారులు పాల్గొన్నారు.






