విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి

by Ratna Kumari |

పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ సూచించారు.

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి
X

దిశ, పటాన్ చెరు టౌన్ : పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ సూచించారు. ప్రతి పోలీసు తన విధులను నిబద్ధతతో నిర్వర్తించినప్పుడే శాఖకు మంచి పేరు వస్తుందని అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన, పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్‌తో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉపయోగపడే కిట్ ఆర్టికల్స్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన **సీసీటీఎన్‌ఎస్-2.0**, **పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్**, **ఫింగర్ ప్రింట్ డివైస్** వంటి సాంకేతిక వ్యవస్థలపై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకుని, నేరాల నియంత్రణలో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాలు, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గ్రామాల బాధ్యతలు నిర్వహిస్తున్న విలేజ్ పోలీసు అధికారులు తమ పరిధిలోని గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో పాటు గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే నేరాల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎస్‌హెచ్‌ఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, బీడీఎల్ భానూర్ ఎస్‌హెచ్‌ఓ విజయ్ కృష్ణ, ఎస్‌ఐ నాగలక్ష్మి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story