సినిమాలు ఆపడం ఆత్మహత్యతో సమానం.. సెన్సార్‌ను బ్యాన్ చేయాలంటూ ఆర్జీవీ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |

ఈ డిజిటల్ యుగంలో, ఇంకా ప్రభుత్వ కమిటీలు సినిమాలను సెన్సార్ చేయడం అనేది చాలా పాతకాలపు ఆలోచన అని, ఇది ముమ్మాటికీ మూర్ఖత్వమేనని అన్నారు.

సినిమాలు ఆపడం ఆత్మహత్యతో సమానం.. సెన్సార్‌ను బ్యాన్ చేయాలంటూ ఆర్జీవీ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: ప్రస్తుత రోజుల్లో సెన్సార్ సమస్యల కారణంగా ఎన్నో సినిమాలు విడుదల వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. పలు సీన్లకు కత్తెర వేసి థియేటర్లలోకి తెస్తుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. ఇక ఈ లిస్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీతో పాటు ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. తాజాగా, ఆర్జీవీ ఈ విషయంపై ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండి, ప్రపంచ సమాచారమంతా ఓపెన్‌గా దొరుకుతున్న ఈ డిజిటల్ యుగంలో, ఇంకా ప్రభుత్వ కమిటీలు సినిమాలను సెన్సార్ చేయడం అనేది చాలా పాతకాలపు ఆలోచన అని, ఇది ముమ్మాటికీ మూర్ఖత్వమేనని అన్నారు. అసలు ఆ సెన్సార్ బోర్డులో కూర్చునే సభ్యుల అర్హత ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఒక పౌరుడికి 18 ఏళ్లు నిండితే దేశాన్ని ఏలే నాయకుడికి ఓటు వేసే హక్కు ఇస్తున్నామని, వందల కోట్ల మంది భవిష్యత్తును మార్చే మెచ్యూరిటీ ఉందన్నప్పుడు.. థియేటర్‌లో ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునే జ్ఞానం లేదా? ఓటు వేసేటప్పుడు నమ్మిన జనాన్ని, సినిమా చూసేటప్పుడు మాత్రం ఏమీ తెలియని చిన్న పిల్లల్లా ట్రీట్ చేయడమేంటని వర్మ మండిపడ్డారు. సినిమా అనేది ఒక డైరెక్టర్ ఆలోచన అని, దాన్ని చూడాలా వద్దా అనేది పూర్తిగా ప్రేక్షకుల ఇష్టమని ఆర్జీవీ స్పష్టం చేశారు. థియేటర్‌లో సీన్లు కట్ చేయడం అనేది ఈ రోజుల్లో అత్యంత హాస్యాస్పదమైన విషయమని అన్నారు. ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో కంటెంట్‌ను దాచాలనుకోవడం ఒక పెద్ద జోక్ అని చిన్న పిల్లలతో సహా అందరూ ఆన్‌లైన్‌లో ఎంతో క్రూరమైన వార్తలు, విపరీతమైన కంటెంట్ చూస్తున్నప్పుడు.. కేవలం సినిమాల్లోని దృశ్యాల వల్లే సమాజం చెడిపోతుందని భావించడం కరెక్ట్ కాదన్నారు. సినీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా సెన్సార్ అధికారుల ముందు మోకాళ్ల మీద నిలబడటం, వాళ్లు చెప్పిన కట్స్‌కు కాంప్రమైజ్ అవ్వడం ఆపాలని ఆర్జీవీ చెప్పారు. సినిమాలు ఆపడం ఆత్మహత్యతో సమానం అని.. అందుకే వెంటనే సెన్సార్‌ను బ్యాన్ చేయాలని డిమండ్ చేశారు.

Next Story