అరిగోస పడుతున్న మక్కల రైతులు

by Nallavelli.Anjaneyulu |

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఖరీఫ్ సీజన్ లో మక్కలను సాగు చేసి మక్క పంటను ప్రభుత్వానికి విక్రయించిన రైతులు కష్టాల పాలయ్యారు.

అరిగోస పడుతున్న మక్కల రైతులు
X

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఖరీఫ్ సీజన్ లో మక్కలను సాగు చేసి మక్క పంటను ప్రభుత్వానికి విక్రయించిన రైతులు కష్టాల పాలయ్యారు. సకాలంలో డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతులు నానా కష్టాల పాలవుతున్నారు. మండలంలో 2025 వర్షాకాలం సమయంలో సుమారు 1200 మంది రైతులు మక్కలను సాగు చేశారు. ఈ పంటను ప్రభుత్వం మద్దతు ధర రూ 2400 కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల మక్కల దిగుబడి ఎక్కువగా ఉండడంతో మండలం కొన్ని ఉప కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక రైతులకు రవాణా భారం ఎక్కువైంది. మక్కలు ప్రభుత్వం కొనుగోలు చేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్న ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

కొనుగోలు లోనూ తప్పని తిప్పలు..

కథలాపూర్ మండలంలో మక్కల సాగు ఎక్కువగా ఉండడంతో కొనుగోలు లో తీవ్ర జాప్యం కారణంగా రైతులకు తిప్పలు తప్పలేదు. ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకవెళ్లారు. దింతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మార్కుపెడ్ అధికారులతో మాట్లాడి కథలాపూర్ మండల కేంద్రంతో పాటు తాండ్రియాల గ్రామంలో కూడా ఒక ఉప కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ అధికారులను సూచించారు. కాగా ఎమ్మెల్యే సూచనతో అధికారులు తాండ్రియాల గ్రామంలో మరొక మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి త్వరితగతిన కొనుగోళ్ళు పూర్తి చేశారు. కొనుగోళ్ళు అనంతరం మొదటి విడతలో కొంతమంది రైతులకు మార్కుపెడ్ అధికారులు వారి ఖాతాల్లో జమ చేశారు. కానీ మిగతా రైతుల మక్కలు కొనుగోళ్ళు పూర్తి చేసి రెండు నెలలు దాటినా కూడా ఇంకా సుమారు 464 మంది రైతుల ఖాతాల్లో నేటి వరకు డబ్బులు జమ కాలేదు.అంటే సుమారు 6 వేల క్వింటల్ల మక్కల డబ్బులు ఇంకా జమ కానీ పరిస్థితి. దింతో మక్కల రైతుల కష్టాలు అగమ్యగోచరంగా మారింది. చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్ర ఆందోళన లో ఉన్న రైతులు రేపో మాపో ధర్నా చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదే విషయమై దిశ ప్రతినిధి ఫోన్ ద్వారా జిల్లా మార్కుపెడ్ అధికారిని మక్కల డబ్బుల విషయమై వివరణ కోరగా స్పందించలేదు.ఇకనైనా మార్కుపెడ్ అధికారులు స్పందించి మా ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా చూడాలని మక్కల రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

మక్కల రైతుల పట్ల ప్రభుత్వం పక్షపాత ధోరణి : కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం మక్క రైతుల పట్ల తీవ్రంగా పక్షపాత ధోరణి అవలంబిస్తుందని, రెండు నెలలు పూర్తయినా ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం శోచనియమని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి.లేదంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల పక్షణా పెద్ద ఎత్తున ఆందోళన చెప్పడతామని ఆయన హెచ్చరించారు.

మార్కుపెడ్ అధికారులు స్పందించి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి : జవిడి ప్రతాప్ రెడ్డి,పెగ్గెర్ల గ్రామ మాజీ సర్పంచ్

ఖరీఫ్ సీజన్ లో మక్కలు సాగు చేసిన మిగతా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా మార్కుపెడ్ అధికారులు కృషి చేయాలి.ఇప్పటికే చేతిలో డబ్బులు లేక సన్న చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించి మా మక్కల రైతుల సమస్యలు పరిష్కరించాలి : చెన్నవేని గంగాధర్

ప్రస్తుతం ఎసంగిలో వేసిన మక్క పంట చేతికి వస్తుందని అయిన కూడా నేటి వరకు ఖరీఫ్ లో సాగు చేసిన మక్కల పైసలు మా ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. దింతో మక్కల రైతులు తీవ్ర ఆవేదన లో ఉన్నారు.ఇప్పటికి ఎన్నో సార్లు మార్కుపెడ్ అధికారులను మక్కల పైసల గురించి ఫోన్ కాల్ ద్వారా అడిగితె రేపు మాపు అంటూ సమాధానం చెపుతున్నారే తప్ప సమస్య ను పరిష్కరించడం లేదు. మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అయిన స్పందించి మక్కల రైతుల ఖాతాల్లో పైసలు జమ చేసే విధంగా మార్కుపెడ్ అధికారులతో మాట్లాడాలి.

Next Story