- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయూష్‌లో ఆగమాగం
మండల కేంద్రంలో పనిచేసే వైద్యాధికారి గత రెండు నెలలుగా విధులు మరోచోట నిర్వర్తిస్తూ కన్నెపల్లి మండల కేంద్రంలో

దిశ, కన్నెపల్లి : మండల కేంద్రంలో పనిచేసే వైద్యాధికారి గత రెండు నెలలుగా విధులు మరోచోట నిర్వర్తిస్తూ కన్నెపల్లి మండల కేంద్రంలో పనిచేస్తున్నట్లుగా జీతం చేసుకుంటున్నాడు. అయినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. కన్నెపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆరోగ్య స్వస్థత కేంద్రం గత 2నెలలుగా మూసి ఉండడంతో మండలంలోని ప్రజలకు ఆయూష్ వైద్య సేవలు అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆయుర్వేద వైద్య సేవలను అందించాలని ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కన్నెపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని డిస్పెన్సరీస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. ఈ ఆరోగ్య స్వస్థత కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఎవరు రెండు నెలలుగా విధులకు రావడం లేదు. దీంతో ప్రజలకు ఆయుర్వేద వైద్య సేవలు అందడం లేదు. కన్నెపల్లి మండలంలో 15గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.20వేలకు పైగా జనాభా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి అందుతున్న వైద్య సేవలు అంతంత మాత్రమే.
ప్రభుత్వ ఆరోగ్య స్వస్థత కేంద్రంలో గతంలో ఇక్కడ పనిచేసిన రెగ్యులర్ వైద్యాధికారి ప్రవీణ్ డిప్యూటేషన్‌పై మెదక్ జిల్లాలోని తుఫ్రాన్‌లో విధులు నిర్వహిస్తూ కన్నెపల్లి మండలంలో పనిచేస్తున్నట్లు జీతం తీసుకుంటున్నాడు. గత రెండున్నర సంవత్సరాల కింద ఇక్కడ వీధుల్లో చేరి కేవలం రెండు నెలలు మాత్రమే కన్నెపల్లి మండల కేంద్రంలో పనిచేశాడు. అనంతరం డిప్యూటేషన్‌పై మెదక్ జిల్లా తూప్రాన్‌కు వెళ్లారు. ఇక్కడ తాత్కాలికంగా బెల్లంపల్లి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ఓ వైద్యాధికారిని ఇంచార్జిగా నియమించారు. ఆయన వారంలో మూడు రోజులు వస్తూ ముఖ్యంగా గురు, శుక్ర, శని వారాల్లో మండలంలోని ఆరోగ్య స్వస్థత కేంద్రానికి ఉదయం 10గంటలకు వచ్చి మధ్యాహ్నం 2గంటల వరకు ఉండి వెళ్లేవారు. గత 2నెలలుగా ఇంచార్జి వైద్య సిబ్బంది కూడా రాకపోవడంతో ఇక్కడ కంపౌండర్, అటెండర్ పోస్టులు సైతం ఖాళీగా ఉండడంతో ఆరోగ్య స్వస్థత కేంద్రాన్ని తెరిచే నాథులే కరువయ్యారు. వైద్య శాఖలో ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇష్టానుసారంగా వైద్యాధికారులు పనిచేస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్య స్వస్థత కేంద్రం మూసి ఉండడంతో వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్ ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పట్టించుకోని అధికారులు...
గ్రామస్తులు వైద్యాధికారి నియామకంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించే వైద్య సిబ్బంది నెలల తరబడి విధులకు రాకుండా ఆరోగ్య కేంద్రాన్ని మూసి ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఆరా తీయకపోవడం ఆ శాఖలోని నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సేవలే దిక్కు కాగా, మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలి జ్వరాలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ప్రభుత్వ ఆయూష్ వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా 2నెలలుగా ఆరోగ్య స్వస్థత కేంద్రం మూసి ఉండడంపై ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రజలకు బీపీ, షుగర్, ఇతర వ్యాధులకు వైద్య సేవలు ఉచితంగా అందించాల్సిన వైద్య సిబ్బంది రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వైద్యశాలలో రూ.వేలల్లో ఖర్చు చేసి ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండల కేంద్రంలోని ఆరోగ్య స్వస్థత కేంద్రంలో వైద్యాధికారి, ఇతర సిబ్బందిని నియమించి వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారుల ఆదేశాల మేరకే...
ప్రవీణ్, రెగ్యులర్ వైద్యాధికారి, కన్నెపల్లి
కన్నెపల్లి మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాను. మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో డిప్యూటేషన్ పై పంపించడంతోనే నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పని చేస్తున్నాను.
వైద్యుడిని నియమిస్తాం..
ప్రమీలాదేవి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, వరంగల్
కన్నెపల్లిలో తాత్కాలికంగా పనిచేసే వైద్యాధికారి ఆరోగ్య పరిస్థితుల కారణంగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో 2 నెలలుగా కన్నెపల్లి ఆరోగ్య స్వస్థత కేంద్రం మూసి ఉంది. త్వరలోనే రెగ్యులర్ వైద్యుడిని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం గతంలో కన్నెపల్లిలో పనిచేసే రెగ్యులర్ వైద్యాధికారి మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. కన్నెపల్లికి వెళ్లేందుకు ఎవరూ సుముఖత చూపక పోవడంతో గత కొంతకాలంగా వైద్య సిబ్బంది లేక ఆరోగ్య స్వస్థత కేంద్రం మూ ఉంది. వైద్యాధికారిని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు లేఖ రాశాం.






