- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలకవర్గాలు లేక చితికిలబడిన పల్లె ఆత్మకథ
దిశ, హుజురాబాద్ రూరల్ : రెండేళ్లుగా పాలకవర్గాలు లేక చితికిలబడిన నేను పల్లెను చెబుతున్నాను.

దిశ, హుజురాబాద్ రూరల్ : రెండేళ్లుగా పాలకవర్గాలు లేక చితికిలబడిన నేను పల్లెను చెబుతున్నాను. ఈ సుదీర్ఘ కాలంలో పాలనను నడిపించిన గ్రామ కార్యదర్శులను, ప్రత్యేక అధికారులను నేను ఏనాడూ తక్కువ చేసి మాట్లాడలేదు. నిజానికి పరిమిత వనరులతో వారు చేసిన సేవలు అభినందనీయం. అవసరాల మేరకు నిధులు రాకపోయినా చేసిన పనులకు బిల్లులు రాకపోయినా, కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రాకపోయినా... నేను ఎవరినీ ఏమీ అనలేదు. ఇప్పటివరకు ఎలాగోలా కార్యదర్శుల పాలన కొనసాగింది. వారిని ఏనాడూ నేను నిలదీయలేదు. ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీసినట్లు గ్రామ కార్యదర్శులను ప్రజలు కూడా అంతగా నిలదీయలేదు. దీనికి ఓ కారణం ఉంది. అధికారుల కన్నా ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉంటారు. తమను ప్రజలు నిలదీస్తారని ఆలోచనతో వారు సమస్యల పరిష్కారానికి మరింత దృష్టి పెడతారు. కార్యదర్శులు తమకున్న అధికార పరిధిలోనే పనిచేస్తారు. వారిపై పనుల ఒత్తిడి ఉన్నా నిధుల లేమి వారిని నిస్సహాయులను చేస్తుంది.
సర్పంచుల పాత్రే కీలకం
స్థానిక సర్పంచులు, పాలకవర్గం కేవలం పరిధిలో పనిచేయరు. వారు ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి తమ గ్రామ సమస్యలను చెప్పి నిధులు తెస్తారు. కనీస అవసరాలు అయినా- తాగునీరు, వీధి దీపాలు, మురికి కాలువలు, రోడ్ల నిర్మాణం, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి పనులు చేయడానికి చొరవ తీసుకుంటారు. ముఖ్యంగా, రైతుల ధాన్యం క్రయవిక్రయాల్లో సమస్యలు రాకుండా చూస్తారు, కొత్త పింఛన్ల మంజూరులో చొరవ చూపుతారు. "గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా, అన్యాయం జరిగినా, వారు ముందుండి పోరాడతారు. ప్రజాప్రతినిధికి, అధికారికి ఉన్న తేడా ఇదే.అందుకే ఇప్పుడు పల్లెల్లో పంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నందున నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా శరీరంలో కొత్త రక్తం ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతోంది. ఈ ఎన్నికల వేళ నా ఆకాంక్షలు మరెన్నో ఉన్నాయి.
కొత్తగా వచ్చే పాలకవర్గాలు ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఈ రెండేళ్లలో పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా పేరుకుపోయిన మురికి కాలువలను శుభ్రం చేయించడం, డంపింగ్ యార్డుల నిర్వహణ మెరుగుపరచడం.శిథిలమైన పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు చేయించడం. గ్రామ యువత కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం, నైపుణ్యాభివృద్ధికి కృషి చేయడం. నిధులు రాక నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేసి కనీస వసతులు కల్పించి, పల్లెలో సర్వతో ముఖ అభివృద్ధికి దోహదపడతారని నేను ఆశిస్తున్నాను. మళ్లీ పచ్చని చేల పక్కన మెరిసే వీధుల్లో పిల్లా పాపలు సంతోషంగా తిరిగే వాతావరణాన్ని నేను చూడాలని కోరుకుంటున్న. నా ఓటుతో నా భవిష్యత్తును నేను నిర్ణయించుకుంటున్న"అని పల్లె కోరుకుంటోంది.






