బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా హుజూరాబాద్‌లో సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా హుజూరాబాద్‌లో సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేయడం, ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియను ప్రజల్లోకి తీసుకెళ్లడం,బూత్ లెవల్ ఏజెంట్ల బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

​ఓటరు జాబితాపై బీఎల్ఏ లు అప్రమత్తంగా ఉండాలి : బోయినపల్లి వినోద్ కుమార్

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బలోపేతంలో ఓటరు నమోదు ప్రక్రియ అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణ, నమోదు ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ​ఎస్ఐఆర్ ఓటర్ నమోదు కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, వారిని భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

​ప్రతి బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు జరగాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

​హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే కొండంత అండ అని, బీఆర్ఎస్ బలోపేతంలో వారి పాత్ర క్రియాశీలకమైనదని కొనియాడారు. పార్టీ అధిష్ఠానం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేవలం పట్టణాలకే పరిమితం చేయకుండా.. ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయికి తీసుకెళ్లాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను, గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేయించాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియలపై మరింత విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఈ నెల 12 న జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు నేతలు ప్రకటించారు. నియోజకవర్గంలోని బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ​పార్టీ లక్ష్యాల సాధన కోసం నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కనబెట్టి సమన్వయంతో ముందుకు సాగాలని ఉద్ఘాటించారు.

Next Story