- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయం.. భయంగా ఊటలా గ్రామంలోకి చెరువునీరు.. నానిపోతున్న ఇళ్లు
ఊరికి జీవనాధారమైన చెరువే.. నేడు ప్రాణసంకటంగా మారింది! ఒకప్పుడు ఆ ఊరి సరిహద్దుల్లోని ఎల్లమ్మ చెరువు నిండి అలుగు పారుతుంటే నారాయణపూర్ పల్లె పరవశించిపోయేది. చెరువు కింద పసిడి పంటలు పండుతుంటే, పాడిపంటలతో ప్రశాంతంగా జీవనం సాగించిన ఆ గ్రామ జీవితాల్లోకి నేడు రిజర్వాయర్ నిర్మాణం ఆరని శోకాన్ని తెచ్చిపెట్టింది.

దిశ, గంగాధర : ఊరికి జీవనాధారమైన చెరువే.. నేడు ప్రాణసంకటంగా మారింది! ఒకప్పుడు ఆ ఊరి సరిహద్దుల్లోని ఎల్లమ్మ చెరువు నిండి అలుగు పారుతుంటే నారాయణపూర్ పల్లె పరవశించిపోయేది. చెరువు కింద పసిడి పంటలు పండుతుంటే, పాడిపంటలతో ప్రశాంతంగా జీవనం సాగించిన ఆ గ్రామ జీవితాల్లోకి నేడు రిజర్వాయర్ నిర్మాణం ఆరని శోకాన్ని తెచ్చిపెట్టింది. పదేళ్ల క్రితం ప్రాజెక్టు అవసరాల కోసం దశాబ్దాల చరిత్ర కలిగిన ఎల్లమ్మ చెరువును అధికారులు రిజర్వాయర్‌గా మార్చారు. ఎల్లంపల్లి నుంచి ప్రతి ఏటా నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తూ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు మత్తడి ఎత్తును పెంచారు. అయితే నీటి ఒత్తిడిని తట్టుకునేలా చెరువు కట్ట ఎత్తు, వెడల్పును పెంచాల్సిన ప్రాథమిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించారు. ఆ నిర్లక్ష్యమే నేడు నారాయణపూర్ గ్రామానికి, అక్కడి ప్రజల ప్రాణాలకు తీరని శాపంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్లలోకి చేరుతున్న విషపురుగులు
కట్ట నాణ్యత లేకపోవడం, ఎత్తు పెంచకుండానే భారీగా నీటిని నిల్వ చేయడంతో చెరువు నీరు గ్రామంలోకి ఊటగా జాలువారుతోంది. పురాతన మట్టి గోడలు, పెంకుటిళ్లు నిరంతరం ఊట నీటితో తడిసి ముద్దవుతున్నాయి. రోజురోజుకూ నానిపోతున్న ఆ ఇళ్లు ఏ క్షణంలో తమ నెత్తిపై కూలిపడి ప్రాణాలు తీస్తాయో తెలియక గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. రాత్రి వేళల్లో ఊట నీటితో పాటు విషసర్పాలు, తేళ్లు, ఇతర విషపురుగులు ఇళ్లలోకి ప్రవేశిస్తుండటంతో చిన్నారులు, వృద్ధులతో కలిసి గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రతి వర్షాకాలంలోనూ ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
నేటికీ మారని తలరాత!
1984లో కురిసిన భారీ వర్షాలకు ఇదే ఎల్లమ్మ చెరువు కట్ట తెగిపోవడంతో నారాయణపూర్, లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్ గ్రామాలు జలమయమయ్యాయి. నాటి భయానక పరిస్థితుల్లో గ్రామస్తులు కట్టుబట్టలతో ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ వారి గుండెల్లో మెదులుతూనే ఉన్నాయి.ఆ తర్వాత 2022లో కూడా వరద ఉధృతికి చెరువు కట్టకు గండి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిసినా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ఊరిని రెండు ముక్కలుగా విభజిస్తారా?
అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ల్యాండ్ అక్విజిషన్ పేరుతో గ్రామంలోని కొద్ది ఇళ్లకు మాత్రమే పరిహారం చెల్లించి, మిగతా వారిని విస్మరించే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.‘తరతరాలుగా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జీవిస్తున్న మా ఊరిని రెండు ముక్కలు చేయకండి’అని వేడుకుంటున్నారు. కేవలం 2.31 ఎకరాల భూమి, కొద్ది ఇళ్లను మాత్రమే ముంపు కిందకు తీసుకుంటామని అధికారులు చెప్పడం పూర్తిగా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట ఎత్తు మరో 2.6 మీటర్లు పెంచితే గ్రామమంతా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.‘మమ్మల్ని నడిసముద్రంలో శ్రీలంక దీవిలా ఒంటరివారిని చేయకండి. అత్యవసర పరిస్థితి వస్తే గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు కూడా దారి ఉండదు’ అని గ్రామస్తుడు దామోదర్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు.
మేము చచ్చిన తర్వాత పరిహారం ఇస్తారా?..
‘ఎంతోమంది అధికారులు వచ్చారు.. వెళ్లారు. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా మా బాధలు పట్టించుకోలేదు. సమస్య చెప్పుకుందామని వెళ్తే హేళనగా మాట్లాడి పంపిస్తున్నారు’ అని నారాయణపూర్ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు చెరువు తెగినప్పుడు రాత్రికి రాత్రే చిన్నపిల్లలను ఎత్తుకుని ఏడ్చుకుంటూ ఊరు వదిలి పారిపోయాం. మేము చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో మాకేం పని? అధికారులు చెరువు కట్టను బలోపేతం చేయాలంటే ముందుగా నారాయణపూర్, ఇస్తారుపల్లె గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించాలి. రెండు గ్రామాలను సంపూర్ణ ముంపు గ్రామాలుగా ప్రకటించి పునరావాసం కల్పిస్తేనే చెరువు కట్ట పనులను చేపట్టాలి. లేకపోతే ప్రాణాలైనా అర్పిస్తాం గానీ మా ఊరిని ముట్టుకోనివ్వం’అని గ్రామస్తులు భీష్మించుకుని కూర్చున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి మానవీయ కోణంలో ఆలోచించి నారాయణపూర్, ఇస్తారుపల్లె గ్రామాలను పూర్తిస్థాయి ముంపు గ్రామాలుగా ప్రకటించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






