రూ.9కే టీ-షర్ట్.. పోటెత్తిన కస్టమర్స్‌.. భారీగా ట్రాఫిక్ జాం

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-09-15 08:47:25  IST  )

దసరా పండుగను పురస్కరించుకుని హుజూరాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన ఒక వస్త్ర దుకాణం యజమాని ప్రకటించిన రూ.9 టీ-షర్ట్ ఆఫర్ ప్రజలను భారీగా ఆకర్షించింది.

రూ.9కే టీ-షర్ట్.. పోటెత్తిన కస్టమర్స్‌.. భారీగా ట్రాఫిక్ జాం
X

దిశ, హుజురాబాద్ రూరల్ : దసరా పండుగను పురస్కరించుకుని హుజూరాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన ఒక వస్త్ర దుకాణం యజమాని ప్రకటించిన రూ.9 టీ-షర్ట్ ఆఫర్ ప్రజలను భారీగా ఆకర్షించింది. ఈ అపూర్వమైన ఆఫర్ గురించి తెలుసుకున్న జనం, ముఖ్యంగా మహిళలు, షాప్ ముందు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీంతో హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ​కొత్తగా ప్రారంభించిన దుకాణానికి ఆదరణ పెంచే ఉద్దేశ్యంతో దుకాణం యజమాని చిన్న పిల్లల టీ-షర్టులను కేవలం రూ. 9 కే విక్రయించాలని నిర్ణయించారు. ఉచితంగా ఇస్తే దానికి విలువ ఉండకపోవచ్చని, అందుకే తొమ్మిది రూపాయల ధర నిర్ణయించినట్లు యజమాని తెలిపారు. ఈ ఆఫర్ గురించి ఆటోల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంతో సమాచారం క్షణాల్లో దావానలంలా వ్యాపించింది. దీంతో ఉదయం 10 గంటలకే దుకాణం ముందు వందల సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. షాపులో ఒక టీ-షర్ట్ మాత్రమే రూ.9కి ఇచ్చి, మిగతా వస్తువులను యథావిధి ధరలకు విక్రయించారని కొందరు మహిళలు తెలిపారు.

అనుకున్నదానికంటే ఎక్కువ మంది జనం రావడంతో దుకాణం సిబ్బంది మొదట షాక్ అయ్యారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో, వారిని క్యూ లైన్‌లో నిలబెట్టి ఒక్కొక్కరికీ టీ-షర్టులను అందించారు. దుకాణం లోపల రద్దీని నియంత్రించడం కష్టంగా మారడంతో, యజమాని రోడ్డుపైనే ఒక టేబుల్ ఏర్పాటు చేసి టీ-షర్టులను విక్రయించారు. ఇది ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అడ్డంకిగా మారింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పటికీ, సమీపంలోని పోలీస్ స్టేషన్ నుండి ఎవరూ వచ్చి పరిస్థితిని నియంత్రించలేదు. ప్రధాన రహదారిపై రద్దీ ఏర్పడినప్పటికీ పోలీసులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story