రామగుండం బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు..

by I. Sairam |

రామగుండం బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు మూడు వర్గాలు మూడు ఎజెండాలు మారింది.

రామగుండం బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు..
X

దిశ, గోదావరిఖని: రామగుండం బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు మూడు వర్గాలు మూడు ఎజెండాలు మారింది. కార్పొరేషన్ ఎన్నికలే నాయకులకు అసలు పరీక్ష! నవ్విన వారి ముందు బోర్ల పడతారా..గట్టెక్కుతారా.. పార్టీలో అంతర్గతపోరు రోజు రోజుకీ మరింత బహిర్గతమవుతోంది. నాయకుల సమన్వయంతో పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు గడ్డు కాలం తయారయింది. జిల్లా అధ్యక్షుని ఇలాకాలోనే ఈ విధంగా ఉంది. రాష్ట్ర పార్టీ అధినాయకుల మద్దతు ఎవరికుంటుందో వేచి చూడాలి.మున్సిపల్ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటుతారో లేక అత్యార్థుల ముందు నవ్వుల పాలవుతారో నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అయోమయంలో నాయకులు, కార్యకర్తలు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీలో ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది.

మూడు వర్గాలు.. మూడు ఏజెండాలు పెట్టుకొని నాయకులు నాయకత్వం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలే ఈ నాయకులకు అగ్ని పరీక్షగా మారింది. కలిసికట్టుగా ఉండి కార్పొరేటర్లను గెలిపించుకుంటారో, లేక ఎవరి దారిలో వారు అభ్యర్థులకు సపోర్ట్ చేసుకుంటారోచూడాలి. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత పోరు రోజురోజుకీ బహిర్గతమవుతోంది. ఒకప్పుడు ఐక్యతగా కనిపించిన పార్టీ ఇప్పుడు ముగ్గురు నాయకులు పార్టీని చీల్చి నాయకత్వం వహిస్తున్నారు. వీరి వర్గపోరుతో కార్యకర్తలు, నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలే ఎవరి సత్తా ఏంటో తేల్చే సమయం వచ్చిందని కార్యకర్తలు అనుకుంటున్నారు.

మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరు కంటి చందర్, యూత్ నాయకుడిగా దూసుకుపోతున్న కౌశిక హరినాథ్ మరోవైపు, అమెరికా నుంచి తిరిగివచ్చిన కేటీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న వ్యాలహరీష్ రెడ్డి మూడు వర్గాలుగా విడిపోయి రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు వర్గాలూ తమకే రాష్ట్రస్థాయి నాయకత్వం మద్దతు ఉందంటూ అంతర్గతంగా ప్రచారం చేసుకుంటుండటం పార్టీ నాయకులకు అంతు చిక్కడం లేదు. ఒక వర్గం పార్టీ అనుభవం, సంస్థాగత బలం పేరుతో ముందుకెళ్తుంటే మరో వర్గం యువత మద్దతు, సోషల్ మీడియా ప్రచారంతో తన ఉనికిని చాటుకుంటున్నారు.

మూడో వర్గం మాత్రం రాష్ట్ర నాయకత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాలే తమ బలమని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ అంతర్గత కుమ్ములాటలో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఎవరి వెంట నిలబడాలి? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేయకపోయినా, లోపల మాత్రం ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుందన్నమాట బహిరంగ రహస్యమే. ఇలాంటి పరిస్థితుల్లో రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు అగ్నిపరీక్షగా మారాయి. ఎవరు తమ వర్గానికి ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకుంటారో వారికే పార్టీలో పైచేయి దక్కుతుందని, లేదంటే ఈ వర్గపోరు పార్టీని నవ్వుల పాలుచేసే ప్రమాదముందని ఇతర పార్టీ రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

మొత్తానికి రామగుండం బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం జరుగుతున్నది పార్టీ అభివృద్ధి పోరు కాదు ఆధిపత్య పోరు.ఈ పోరులో గెలిచేది ఎవరో, కానీ నష్టపోయేది మాత్రం పార్టీ అన్నది రాబోయే ఎన్నికలే తేల్చనున్నాయి. పార్టీ జెండా, ఎజెండా ఒకటే అయినా, కార్యక్రమాలు మాత్రం వేరువేరుగా సాగుతున్నాయి. ఒక వర్గం చేపట్టే కార్యక్రమానికి మరో వర్గం నాయకులు ముఖం చూపించని పరిస్థితి నెలకొంది. ఎవరి బలాన్ని వారు చూపించుకునే ప్రయత్నంలో, అసలు పార్టీ బలం తగ్గిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అధిష్టానం చొరవ తప్పనిసరి!..

ఈ పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం వెంటనే చొరవ తీసుకొని మూడు వర్గాలను ఒక్కటి చేయకపోతే, రామగుండంలో బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కటి అయితేనే మనగడ విడిపోయితే కష్టమే అన్న మాట ఇప్పుడు రామగుండం బీఆర్‌ఎస్‌లో నినాదంగా మారింది. అధిష్టానం చొరవ లేకుంటే రామగుండం చేజారేనా?. ఇదంతా చూసి ఇతర పార్టీల నాయకులు మాత్రం తెర వెనక నవ్వుకుంటున్నారు. వాళ్లే వాళ్లను ముంచుకుంటున్నారు. మనకేం పని అన్న ధోరణితో రాజకీయ ప్రత్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రశ్న ఒక్కటే కార్పొరేషన్ ఎన్నికల కైనా బీఆర్ఎస్ నాయకులు ఒక్కటవుతారా?.. రామగుండంలో కార్పొరేటర్లను గెలిపించి పార్టీకి ఊపునిస్తారా?.. లేకపోతే నలుగురు ముంగట నవ్వుల పాలై పార్టీ పరువు తీస్తారా? ఇప్పటికైనా విభేదాలు పక్కనపెట్టి, కార్యకర్తలకు దిశ చూపించి పార్టీని ముందంజలో నిలబెట్టగలరా? లేకపోతే రామగుండంలో బీఆర్ఎస్ భవిష్యత్తే ప్రశ్నార్ధకమైన పరిస్థితులు తీసుకు వస్తారు వేచి చూడాలి.

Next Story