- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు : కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు.

దిశ, గోదావరిఖని : నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పని తీరును సమగ్రంగా సమీక్షించారు. ఇప్పటివరకు నమోదైన కేసులు, పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై సీపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం త్వరితగతిన అందేలా న్యాయాధికారులతో సమన్వయం పాటించాలని సూచించారు. దొంగతనాల నివారణ, కేసుల ఛేదనపై సమీక్షిస్తూ, నేరస్తులను పట్టుకోవడంలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు.
రికవరీ శాతం పెంచి బాధితులకు వారి సొత్తును తిరిగి అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చోరీలకు పాల్పడే వ్యక్తులపై హిస్టరీ షీట్లు తెరవాలని తెలిపారు. చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు, కాలనీలు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాల పనితీరును స్టేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం పాటిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక “అరైవ్-అలైవ్” కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని ఆదేశించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు,జూదం ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్,పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్,జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు, ఇన్ స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.






