తంగళ్లపల్లిలో వీధి కుక్కల స్వైర విహారం : అధికారుల నిర్లక్ష్యానికి బాలుడు బలి

by Naga Rani Yarlagadda |

తంగళ్లపల్లిలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల్ని నిర్మూలించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.

తంగళ్లపల్లిలో వీధి కుక్కల స్వైర విహారం : అధికారుల నిర్లక్ష్యానికి బాలుడు బలి
X

దిశ, తంగళ్లపల్లి : తంగళ్లపల్లి మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారి చివరకు ఒక బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. కుక్కలు వెంబడించడంతో కిందపడి గాయపడిన ఏడేళ్ల ఆదిత్య, ఆస్సత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మండలంలోని గ్రామాలన్నీ కుక్కల గుంపుల స్వైర విహారంతో భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నాయి. పశువులు, మేకలపై కూడా దాడులు జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన నియంత్రణ ఆదేశాలు తంగళ్లపల్లి మండలంలో కాగితాలకే పరిమితమయ్యాయి. గతంలో పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు స్పందించి ఉంటే ఈ బాలుడి ప్రాణం మిగిలేదని ప్రజలు వాపోతున్నారు. పిల్లలను వీధుల్లోకి పంపాలంటేనే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొన్నది.

గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రాణాలు తీస్తున్నా, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కుక్కల దాడులపై గతంలో అనేక కథనాలు ప్రచురితమైనా యంత్రాంగం మేల్కొనకపోవడంతో, తాజాగా ఓ బాలుడి నిండు ప్రాణం బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆదిత్య (7) అనే బాలుడిని కుక్కలు వెంబడించడంతో భయపడి పరిగెత్తుతూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 15 రోజుల తర్వాత పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటనతోనైనా అధికారుల తీరులో మార్పు రావాలని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో తరచూ దాడులు

మండలంలోని పలు గ్రామాల్లో శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్లే వారిపై దాడులకు తెగబడుతున్నాయి. మనుషులనే కాకుండా పశువులు, గొర్రెలు, మేకల వంటి మూగజీవాలను సైతం వదలడం లేదు. కుక్కల భయంతో ప్రజలు వీధుల్లోకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు వణుకుతున్నారు. మండలంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఎవరో ఒకరు కుక్కల దాడిలో గాయపడుతూనే ఉన్నారు. ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించినా, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రాణాల మీదకు తెస్తున్న గ్రామ సింహాలు

గ్రామీణ ప్రాంతాల్లో రక్షణగా ఉండాల్సిన కుక్కలు, నేడు ప్రాణాలు తీసే స్థాయికి చేరడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వీధుల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై కుక్కలు ఎగబడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు ఉండడంపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, మండల వ్యాప్తంగా కుక్కల బెడదను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story