- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలు వచ్చిందంటే.. గేటు మూసుడే!
పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలు,

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైల్వేమార్గం పెద్దపల్లి శివారును ఆనుకొని ఉంటుంది. పెద్దపల్లి నుంచి ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, జమ్మికుంట, వరంగల్ దాకా ఇదే ప్రధాన రహదారిగా ఉంది. ఢిల్లీ-గ్యాంగ్‌టక్ రూట్‌లో నిత్యం వందలాది రైళ్ల రాకపోకలతో ఇక్కడ గంటకు నాలుగైదుసార్లు రైల్వే గేటు పడుతుండడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఓబీ నిర్మాణంలో జాప్యం...
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.119.5కోట్ల నిధులు మంజూరు చేశాయి. 2022 అక్టోబర్‌లో గత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పనులను ప్రారంభించారు. మొదట్లో వేగంగా సాగినా, ఆ తర్వాత ప్రభుత్వం మారడం, అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపం కారణంగా పనులు జాప్యం అవుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు మూడేళ్లు కావస్తున్నా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజల కల నెరవేరడం లేదు.
ఎమ్మెల్యే అసమర్ధత వల్లే.. : బీజేపీ
బీజేపీ పెద్దపల్లి మున్సిపల్, మండల అధ్యక్షులు పెంజర్ల రాకేష్, వేల్పుల రమేష్ ఆర్ఓబీ పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం ధర్నా చేపట్టారు. కేంద్రం రూ.130కోట్లు మంజూరు చేసినా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు అసమర్థత వల్ల పనులు పూర్తికావడం లేదని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన పనులు, ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు వల్ల నెమ్మదిగా సాగుతున్నాయని విమర్శించారు. సర్వీస్ రోడ్లు గుంతలమయమై, దుమ్ముధూళితో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సర్వీసు రోడ్డు పనులను పూర్తి చేయాలని, బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు.






