అర్ధశతాబ్దపు అజ్ఞాతం ‘బుక్క సత్తన్న’ఎక్కడ?

by velandi.Saikiran |   (  Updated:2026-02-25 22:00:55  IST  )

50 ఏళ్లుగా దేవరకొండ సత్యనారాయణ అలియాస్ బుక్క సత్తన్నఆచూకీ లేకపోవడం పోలీసు, హుజురాబాద్ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.

అర్ధశతాబ్దపు అజ్ఞాతం ‘బుక్క సత్తన్న’ఎక్కడ?
X

అర్ధశతాబ్దపు అజ్ఞాతం

‘బుక్క సత్తన్న’ఎక్కడ?

- 50 ఏళ్లుగా లభించని దేవరకొండ సత్యనారాయణ ఆచూకీ

- 1975 పెద్దపల్లిలో ఐటీఐ చదువుతూ అజ్ఞాత జీవితంలోకి

- మావోయిస్టు, పోలీసుల రికార్డుల్లోనూ దొరకని ఆనవాళ్లు

దిశ, హుజురాబాద్ రూరల్: తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో చేరినవారంతా ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. అయితే ఒక పాతతరం విప్లవకారుడి ఉదంతం మాత్రం ఇంకా మిస్టరీగానే మారింది. 50 ఏళ్లుగా దేవరకొండ సత్యనారాయణ అలియాస్ ‘బుక్క సత్తన్న’ఆచూకీ లేకపోవడం పోలీసు వర్గాలతోపాటు హుజురాబాద్ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. సత్తన్నది హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామం. కాగా ఆయన తండ్రి చనిపోవడంతో తల్లి ఇద్దరు కొడుకులను తీసుకుని పుట్టినిల్లైన హుజురాబాద్ మండలం చెల్పూర్‌కు చేరింది. దీంతో జమ్మికుంటలో 10వ తరగతి పూర్తిచేసిన సత్యనారాయణ.. పెద్దపల్లిలో ఐటీఐ చదువుతున్నప్పుడు విప్లవ భావజాలానికి ఆకర్షితులయ్యారు. అప్పట్లో పెద్దపల్లి రాడికల్ విద్యార్థి సంఘానికి కంచుకోటగా ఉండటంతో పీపుల్స్ వార్ నాయకుడైన దగ్గు రాజలింగం సాహచర్యంతో సత్యనారాయణ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత భయ్యపు దేవేందర్ రెడ్డి స్ఫూర్తితో పూర్తిస్థాయిలో ‘పీపుల్స్ వార్’లో భాగమయ్యారు.

సత్తన్న బ్రతికే ఉన్నారా?

​1975లో అజ్ఞాతంలోకి వెళ్లిన సత్యనారాయణ పదేళ్ల క్రితం ఆయన తల్లి మరణించినా రాలేదు. ఆయన సోదరుడు గ్రామంలో లేకపోవడంతో సత్తన్న జ్ఞాపకాలు చర్చల్లోనే మిగిలిపోయాయి.​అసలు సత్తన్న బ్రతికే ఉన్నారా? ఉంటే ఏ హోదాలో ఉన్నారు? అడవిలోనే అమరులయ్యారా? అన్న ప్రశ్నలు ఉత్కంఠరేపుతున్నాయి. సాధారణంగా మావోయిస్టు అగ్రనేతల వివరాలు, వారిపై ఉన్న రివార్డులు పోలీసు రికార్డుల్లో స్పష్టంగా ఉంటాయి. కానీ, సత్యనారాయణ విషయంలో సీన్ రివర్స్. గతంలో ఆయన పీపుల్స్ వార్ పార్టీలో ‘టెక్నికల్ డిపార్ట్మెంట్’ (ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్) విభాగంలో కీలకంగా పనిచేసినట్లు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు విడుదల చేసిన అజ్ఞాత నక్సలైట్ల జాబితాలో కూడా ఆయన పేరు లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. సత్తన్న వేరే రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారా? లేక అనారోగ్యంతో ఎక్కడైనా కన్నుమూశారా? అనేది అధికారులకే అంతుచిక్కడం లేదు.​రాష్ట్రంలో కీలక మావోయిస్టు నేతలు వరుసగా లొంగిపోతుండటం లేదా మరణిస్తుండటంతో ‘బుక్క సత్తన్న’ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు విప్లవ పథంలో వెలుగు వెలిగిన నేత కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా పోవడం విచారకరం. పోలీసుశాఖ లేదా మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన చేస్తే తప్ప సత్తన్న అర్ధ శతాబ్దపు అజ్ఞాత మిస్టరీ వీడేలా లేదు.

Next Story