మహిమ గల దేవుడు...మైలారం మల్లికార్జునుడు

by velandi.Saikiran |

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో త్రిశూల కొండపై మహిమగల దేవుడు భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు స్వయంభుగా వెలసి భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారం గా విరాజిల్లుతున్నాడు.

మహిమ గల దేవుడు...మైలారం మల్లికార్జునుడు
X

దిశ, గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో త్రిశూల కొండపై మహిమగల దేవుడు భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు స్వయంభుగా వెలసి భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారం గా విరాజిల్లుతున్నాడు. మానేరు పరివాహక ప్రాంతం, చుట్టూ పచ్చని చెట్లతో మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ప్రకృతి రమణీయతతో ఉన్న ప్రదేశం ఈ మైలారం మల్లికార్జున స్వామి ఆలయం. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈ త్రిశూల కొండపై ఉన్న గుహలో మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతుడై వెలిశాడని ఇక్కడి ప్రజల విశ్వాసం.

పచ్చి పసుపు రాలుతుంది

మల్లికార్జుని మహిమకు ప్రతీకగా ఆలయ ప్రాంగణంలో సట్టేడు వారాలలో ఆలయ ప్రాంగణంలో ఎవరికి తెలియని రీతిలో పచ్చి పసుపు రాలుతుంది. ఇక్కడ స్వామివారికి బోనాలు చేసి పెద్ద పట్నం వేసి ముడుపు కడితే వారి కోరిన కోరిక తప్పక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో గణపతి, రేణుకా మాత, పోచమ్మ తల్లి, ప్రక్కనే సమ్మక్క సారలమ్మ ఆలయాలు ఎంతో ప్రఖ్యాతి ఘటించినవి. నాటి నుంచి నేటి వరకు మైలారం గ్రామస్తులు మండల ప్రజలు గొల్ల కురుమలు తమ ఇల వేల్పుగా నిలుపుకొని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ఆలయ ఆధునీకరణ పనులు

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మామిడాల నాగ సాయి శర్మ సూచనలతో దేవాలయ శాశ్వతదాత అక్కన్నపెళ్లి రాజేష్( విజయ్ మసాలా డ్రై ఫ్రూట్స్ కరీంనగర్) దాతల సహకారంతో ఆలయ ఆధునీకరణ పనులు వేగవంతంగా సాగుతూ పూర్తికాను వచ్చాయి.

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం గిరి ప్రదక్షణ భాగ్యం

ఆలయ కమిటీ అధ్యక్షుడు వరాల పరుశరాములు....

మల్లికార్జున స్వామి దర్శనంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం, గిరి ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాము. జ్యోతిర్లింగ ఆలయాల నిర్మాణం, గిరి ప్రదక్షిణ మార్గ నిర్మాణం పూర్తి కావచ్చింది. భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాము.

త్రిశూలగుట్ట గిరి ప్రదక్షిణం తో మోక్ష ప్రాప్తి

ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల నాగ సాయి శర్మ.

శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కొలువుదీరి ఉన్న త్రిశూల గుట్ట చుట్టూ గిరి ప్రదక్షణ చేస్తే తప్పక మోక్షం లభిస్తుంది. ఈ గిరి ప్రదక్షణ మార్గంలో ఏర్పాటుచేసిన ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయ దర్శనం తో ఆత్మ అనుభూతి చెందుతుంది. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రారంభమై దక్షిణామూర్తి జ్ఞానంతో ముందుకు సాగి కర్తవీర్యార్జున మండపంలో పంచభూత శివలింగాలు, ఆరు రూపాయల సుబ్రహ్మణ్య క్షేత్రాలు, భ్రమరాంబిక అమ్మవారి పంచ మండపాల ఆలయం, అష్టభైరవుల ప్రత్యేక సన్నిధి దర్శనం, 102 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, 84 అడుగుల పార్వతీ పరమేశ్వరుల దర్శనంతో గిరి ప్రదక్షిణ పూర్తయ్యే లోపు శివుడు ఎవరు శివతత్వం ఏమిటి అని తెలిపే గొప్ప దైవ క్షేత్రం మైలారం మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు గిరి ప్రదక్షిణ చేసి తరించాలి.

దాతల సహకారంతో అభివృద్ధి పనులు

అక్కనపెల్లి రాజేష్( విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ కరీంనగర్) ఆలయ శాశ్వత దాత.

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ఆధునీకరణ లో భాగంగా గుట్ట చెట్టు ద్వాదశ జ్యోతిర్లింగాలు గిరి ప్రదక్షిణ మార్గం మొదలైన ఆలయాల నిర్మాణాలు దాతల సహకారంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఒక దివ్య ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి భక్తులకు కల్పించాలనే సంకల్పంతో గొప్ప గొప్ప ఆలయాల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. ఆలయ నిర్మాణాలలో దాతలు పాల్గొని వారి జన్మను తరింప చేసుకోవాలి.

ఈనెల 16 17 18 తేదీలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జాతర

శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి 18 తేదీ వరకు కన్నుల పండుగగా సాగనున్నాయి. తొలి రోజు గోపూజ గురు వందనం తో పాటు మహా రుద్ర యాగం ప్రారంభమవుతుంది.17వ తేదీన పల్లకీ సేవ కన్నుల పండుగ సాగనున్నది. చివరి రోజు 18వ తేదీన పెద్దపట్నం కేతకీ మాడలమ్మ సమేత మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అగ్నిగుండాల కార్యక్రమం తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తెగడ గ్రామం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయ వీర శైవచ్చకులు ఎల్లా మందల శ్రావణ్ కుమార్ చే నారసాల సంబర పాగోల సంబర ఖడ్గ నాట్య నిర్వహణ, పల్నాడు జిల్లా నరసరావుపేట వాస్తవ్యులు సాంబయ్య వీరశైవ వీరభద్ర నాట్య విన్యాసాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని సభ్యులు ఆహ్వానం పలుకుతున్నారు.

Next Story