జమ్మికుంటలో ‘కంచే చేను మేసినట్లు’

by velandi.Saikiran |   (  Updated:2026-02-06 22:16:15  IST  )

చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారుతుంటే.. ప్రభుత్వ భూములకు దిక్కెవరు? జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.

జమ్మికుంటలో ‘కంచే చేను మేసినట్లు’
X

దిశ,​జమ్మికుంట: చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారుతుంటే.. ప్రభుత్వ భూములకు దిక్కెవరు? జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. నిబంధనలను తుంగలో తొక్కి రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకొని కొందరు నాయకులు, అధికారులు కుమ్మక్కై సాగిస్తున్న అక్రమ దందాలపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.

​సర్వే నంబర్లు మార్చి.. మాయాజాలం!

​పట్టణంలోని సర్వే నంబర్ 652లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు ఏకంగా సర్వే నంబర్ 648లోని మహిళ మండలికి కేటాయించిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఒక సర్వే నంబర్ స్థానంలో మరొక చోట నిర్మాణం జరిగితే అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు ఇక్కడ మాత్రం మౌనం వహించడమే కాకుండా.. వారికి అనుమతులు మంజూరు చేయడం వెనుక పెద్ద ఎత్తున ‘అంతర్యం’ దాగి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

​సాధారణ పౌరుడు చిన్నపాటి రేకుల షెడ్డు వేసుకుంటేనే నోటీసులతో హల్చల్ చేసే అధికారులు కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే కళ్లు మూసుకోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.

​రాజకీయ అండతోనే అక్రమాలు

​దీనిపై సామాజిక కార్యకర్త సిలువేరు శ్రీకాంత్ జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.​"జమ్మికుంటలో రాజకీయ పలుకుబడి ఉంటే ఏదైనా సాధ్యమనే రీతిలో పరిస్థితులు తయారయ్యాయి. ఒక సర్వే నంబర్ పత్రాలతో మరో సర్వే నంబర్‌లో ఇళ్లు కడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం వెనుక వారి అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ఈ కబ్జాలను ప్రోత్సహించడం సిగ్గుచేటు. బాధ్యత గల పదవుల్లో ఉండి ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి, వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో సహకరించడం క్షమించరాని నేరం. అంటూ పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.​పట్టణంలో సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాల వెనుక భారీగా చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది. సర్వే నంబర్ల మార్పిడి అనేది సాంకేతిక అంశం కాబట్టి అది అధికారుల ప్రమేయం లేకుండా జరగడం అసాధ్యం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడటమే కాకుండా భవిష్యత్తులో ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

​న్యాయపోరాటానికి సిద్ధం...

​అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ కేటాయింపులు, నిర్మాణాలపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.​తక్షణమే సదరు నిర్మాణాలను నిలిపివేయాలనీ,

​సర్వే నంబర్ల మార్పిడిపై విచారణ జరిపి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలనీ,​ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.​ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ స్పందించి జమ్మికుంట మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ "భూ మాయాజాలం"పై సమగ్ర విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Next Story