షాడోను కాదు..నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే

by velandi.Saikiran |   (  Updated:2026-07-15 22:00:30  IST  )

పాలన పరమైన అంశాల్లో తలదూర్చుతున్న ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు రాజకీయ అంశాల్లో సైతం కీలక పాత్రనే పోషిస్తున్నట్టు అధికార పార్టీలో చర్చ జరుగుతుంది.

షాడోను కాదు..నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే
X

దిశ బ్యూరో, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడి వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది. అతగాడి ఆగడాలకు అధికారులు.. అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాను చెప్పింది చెయ్యాల్సిందే.. లేదంటే అధికారులైతే బదిలీ వేటు.. అధికార పార్టీ నేతలయితే కటకటాలు లెక్కించాల్సిందే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అతగాడిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా చర్యలు ఉండక పోవడంతో రెచ్చిపోతున్న నేత, వ్యక్తిగత సహాయకుడు ఇక్కడ నేను షాడో ను కాదు నెక్స్​టు ఎమ్మెల్యే నేనే తేడా వస్తే అంతు చూస్తా అన్నట్టు హెచ్చరికలు జారీచేయడంతో అధికార పార్టీలో అలజడి మొదలైంది. అతగాడి వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యాయత్నాలకు ఒడిగడుతుంటే మరికొందరు వాల్ పోస్టర్లు కరపత్రాలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

శృతిమించుతున్న ఆగడాలు

అవినీతి అక్రమాలను అరికడతా.. పారదర్శక పాలన అందిస్తా అంటూ కళ్లబోల్లి మాటలు చెప్పి తీరా ఎన్నికల్లో గెలిచిన కరీంనగర్ జిల్లాలోని ఓ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యుడు, అతని అనుచరులు రజాకార్ల పాలనను మరిపిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు, పాలనపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటూ ప్రత్యేక పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను పక్కకు పెట్టి క్యాంపు కార్యాలయం నుంచి పాలన సాగిస్తున్నారు. అయితే

కొందరు ఉన్నతాధికారులు జీ హుజుర్ అన్నట్టుగా వ్యవహరించడంతో పాలన పక్కదారి పడుతూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుండగా సహకరించని అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఇది సబబు కాదు అంటూ చెప్పేందుకు ప్రయత్నం చేసిన, వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రశ్నించినా కన్నెర్ర చేస్తున్న సహాయకుడు వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ కటకటాల్లో కి పంపిస్తున్నారు. దీంతో కొందరు పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తుండగా మరికొందరు వారితో మేము ఏగలేము ఆత్మహత్యేలే శరణ్యం అంటూ ఆత్మహత్య యత్నాలకు ఒడిగడుతున్నారు.

చెప్పింది చేయాల్సిందే ఇక్కడ నేనే బాస్

జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నియోజకవర్గంలో జరుగుతున్న ఎమ్మెల్యే సహాయకుడి ఆగడాలతో ఆ నియోజకవర్గం బారత దేశంలో భాగమేనా ? లేక అక్కడ రాచరిక పాలన సాగుతుందా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజ్యంగ బద్ధంగా ఉద్యోగాలు పొందిన ఉద్యోగులపై సదరు సహాయకుడి వ్యవహార శైలితో నలిగిపోతున్నారు. తను చెప్పింది చెయ్యాల్సిందే లేదంటే సస్పెండ్ చేపిస్తా.. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా అంటూ హెచ్చరికలు చేయడంతో ఆ నియోజకవర్గంలో పోస్టింగ్ అంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. తాను చెప్పింది వినకపోతే ఎమ్మెల్యే నుంచి ఫోన్ ‘ఏమైందయ్యా తమాషా నా పనిచేస్తలేవంట నీ మీద ఫిర్యాదులు వస్తున్నాయి.. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయ్ లేదంటే ఇంటికి పంపిస్తా’ అంటూ హెచ్చరికలు దీంతో ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఉద్యోగవర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది

కీలకంగా మారిన శాసన సభ్యుడి పోన్

శాసన సభ్యుడి వ్యక్తిగత సహాయకుడి ఆగడాల్లో అధికారులను హడలెత్తిస్తున్న అంశంలో కీలక పాత్ర పోషిస్తున్నది ఎమ్మెల్యే ఫోన్ ముందుగా ఏదైనా పని అధికారి ముందు పెట్టాలి అంటే ముందుగా ఎమ్మెల్యే పర్సనల్ మొబైల్ నుంచి మెసేజ్ వెల్తుంది. ఆపై వ్యక్తిగత సహాయకుడి ఫోన్ వెళ్తుంది. అధికారులు పనిచేసి పెట్టారో ఓకే. లేదంటే తక్షణమే ఎమ్మెల్యే మొబైల్ నుంచి నేరుగా ఫోన్. దీంతో హడలెత్తిపోతున్న అధికారులు అది అక్రమమైనా తప్పని పరిస్థితుల్లో పనిచేసిపెట్టాల్సి వస్తుంది అని అధికారులు భయం వ్యక్తం చేస్తూ ఎక్కడ కేసుల్లో ఇరుక్కుని ఉద్యోగాలు పోగోట్టు కోవాల్సి వస్తుందో అనే భయంతో కాలం వెల్లదీస్తున్నారు

షాడో ను కాదు నెక్స్​టు ఎమ్మెల్యేను..

పాలన పరమైన అంశాల్లో తలదూర్చుతున్న ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు రాజకీయ అంశాల్లో సైతం కీలక పాత్రనే పోషిస్తున్నట్టు అధికార పార్టీలో చర్చ జరుగుతుంది. దీంతో సహాయకుడి కనుసన్నల్లో ఉంటే నే పదవులైనా, పనులైనా అన్నట్టుగా తయారైంది పరిస్థితి. దీంతో క్యాడర్ కు సదరు ఎమ్మెల్యేకు చెప్పడం కంటే సహాయకుడు చెబితేనే పనులు అవుతాయి అనే నమ్మకం ఎక్కువ. పైగా

నియోజకవర్గ పునర్విభజన లో నియోజకవర్గం మారుతుంది. టికెట్ మనకే నెక్స్ట్ ఎమ్మెల్యే మనమే అనే ధీమా వ్యక్తం చేయడంతో అధికార పార్టీ నేతలు సైతం ఎందుకునచ్చిన గొడవ అని సర్దుకుని పోతున్నారు. సదరు సహాయకుడు పలు సందర్భాల్లో షాడో అని ప్రచారం జరుగుతుంది..నేను షాడోను కాదు ఎమ్మెల్యేనే అని చెప్పడం కూడా పార్టీ క్యాడర్ ను సందిగ్ధంలో పడేస్తుంది. దీంతో ఆ నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా పాలన సాగుతుండగా ఆక్రమణలు, అక్రమాలు, అరాచకాలు అడ్డూ అదుపులేకుండా ప్రజలకు ఆ నియోజకవర్గంగా శాపంగా పరిణమించింది అన్నట్టుగా చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. అటు అధికార పార్టీలో సైతం సహాయకుడి వ్యవహార శైలి కలకలం సృష్టిస్తుంది.

Next Story