జమ్మికుంటలో 'రియల్' మాఫియా మాయాజాలం

by velandi.Saikiran |   (  Updated:2026-01-24 22:45:51  IST  )

జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంట శివారులోని సర్వే నంబర్లు 1163, 1164 కేంద్రంగా ఈ భారీ స్కామ్ నడుస్తోంది. వాస్తవానికి ఇక్కడ కేవలం 6 ప్లాట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయింది.

జమ్మికుంటలో రియల్ మాఫియా మాయాజాలం
X

దిశ,​జమ్మికుంట : నిబంధనలు గాలికి వదిలేసి... అమాయక ప్రజల ఆశలే పెట్టుబడిగా.. రాజకీయ అండదండలతో సాగుతున్న ఈ 'రియల్' మాయాజాలం జమ్మికుంట పట్టణంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం కొద్దిపాటి ప్లాట్లకు అనుమతి పొంది, ఏకంగా ఎకరాలకు ఎకరాలు అక్రమంగా విక్రయిస్తూ సామాన్యులను నిలువునా ముంచేందుకు ఒక ముఠా సిద్ధమైంది. అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న ఈ దందాను చూస్తుంటే, ఇక్కడ చట్టం ఉందా? లేక రియల్టర్ల కబంధ హస్తాల్లో బందీ అయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనుమతులు గోరంత.. అమ్మకాలు కొండంత...

​జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంట శివారులోని సర్వే నంబర్లు 1163, 1164 కేంద్రంగా ఈ భారీ స్కామ్ నడుస్తోంది. వాస్తవానికి ఇక్కడ కేవలం 6 ప్లాట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయింది. కానీ సదరు యజమానులు ఆ చిన్న అనుమతి పత్రాన్ని చూపిస్తూ, ఏకంగా 6 ఎకరాల విస్తీర్ణంలో అనధికారిక వెంచర్‌ను ఏర్పాటు చేశారు. గతంలో మున్సిపల్ అధికారులు ఇక్కడి హద్దురాళ్లను తొలగించినప్పటికీ, నిర్వాహకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు.

​కొత్త ఎత్తుగడలు.. పాత బాధితులు!

​గతంలో హద్దురాళ్లు ఉంటే అధికారులు కూల్చేస్తున్నారని గ్రహించిన ఈ మాఫియా, ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసింది. హద్దురాళ్లు లేకుండానే, కేవలం మార్కింగ్‌లతో ప్లాట్లను చూపించి రిజిస్ట్రేషన్లు చేసేందుకు పావులు కదుపుతోంది.

​కొనేముందు జాగ్రత్త.. లేదంటే ఇల్లు కట్టుకోవడం కల్లే!

​కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ప్లాట్లు కొనేవారు ఈ క్రింది విషయాలను గమనించకపోతే భవిష్యత్తులో రోడ్డున పడాల్సి వస్తుంది.​ వెంచర్‌లో ఖచ్చితంగా 30 నుంచి 40 అడుగుల రోడ్లు ఉండాలి. కానీ ఇక్కడ ఆ నిబంధనలేవి పాటించడం లేదు. రోడ్డు వెడల్పు లేకపోతే భవిష్యత్తులో మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వరు. కేవలం ఒక చిన్న భాగానికి అనుమతి చూపి, మొత్తం వెంచర్ సక్రమమేనని నమ్మిస్తున్నారు. విక్రయించే ప్రతి గజానికి ఎల్ఆర్ఎస్ ఉందో లేదో సరిచూసుకోవాలిని, అనుమతులు లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ పొరపాటున రిజిస్ట్రేషన్ అయినా, అది చెల్లదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

​నాయకుల అండ.. అధికారుల ఉదాసీనత?

​ కొంతమంది ముఖ్య నేతల ఒత్తిడి కారణంగానే అధికారులు ఈ అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. "అధికారులు వస్తారు.. హద్దురాళ్లు తీసేస్తారు.. వెళ్ళిపోగానే మళ్ళీ పనులు మొదలవుతాయి" అన్న చందంగా మారింది పరిస్థితి. సామాన్యుడి సొమ్మును దోచుకుంటున్న ఈ తిమింగలాలపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ వెంచర్‌ను పూర్తిగా సీజ్ చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

​అధికారుల హెచ్చరిక...

"సర్వే నంబర్ 1163, 1164లో సరైన పత్రాలు లేవు. తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేసి ఇబ్బందులు పడకండి. అనుమతులు లేని చోట ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు రావు. ప్రజలు మోసపోవద్దు." ప్లాట్లు కొనేవారు సదరు వెంచర్‌కు సంబంధించిన నంబర్‌ను మున్సిపల్ కార్యాలయంలో సరిచూసుకున్న తర్వాతే నగదు చెల్లించాలని కోరుతున్నాము. లేనిపక్షంలో మీ కష్టార్జితం బుడగలా కరిగిపోయే ప్రమాదం ఉందని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్,హుజురాబాద్ సబ్ రిజిస్టర్ లు హెచ్చరిస్తున్నారు.

Next Story