డొమెస్టిక్​ దుర్వినియోగం.. ఇంటి గ్యాస్‌తో హోటళ్ల వంటలు ?

by velandi.Saikiran |   (  Updated:2026-03-13 21:16:04  IST  )

డొమెస్టిక్​ దుర్వినియోగం.. ఇంటి గ్యాస్‌తో హోటళ్ల వంటలు ?
X

దిశ ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను హోటళ్లలో వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇంటి అవసరాల కోసం మాత్రమే ప్రభుత్వం అందించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను కొంతమంది హోటల్ యజమానులు వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

రోజుకు ఒక్కో సిలిండర్ వినియోగం

ఇల్లంతకుంటలోని కొన్ని హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లలో రోజుకు కనీసం ఒక్కో డొమెస్టిక్ సిలిండర్ వరకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇలా పెద్ద మొత్తంలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం గమనార్హం.

నిబంధనలు ఉల్లంఘన

నియమాల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ కేంద్రాలు వంటి వ్యాపారాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు మాత్రమే వినియోగించాలి. అయితే ఇల్లంతకుంటలో పలుచోట్ల హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లతోనే వంటలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తక్కువ ధరతో వినియోగం..?

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర కమర్షియల్ సిలిండర్‌తో పోలిస్తే తక్కువగా ఉండడం, పైగా సబ్సిడీ కూడా రావడం వల్ల కొంతమంది హోటల్ యజమానులు వాటిని వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డెలివరీ సిబ్బంది పాత్ర ఉందా..?

డొమెస్టిక్ కనెక్షన్ పేరుతో తీసుకున్న సిలిండర్లు హోటళ్లకు ఎలా చేరుతున్నాయన్నది ప్రశ్నగా మారింది. కొంతమంది డెలివరీ సిబ్బంది కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏడాదికి 6–9 సిలిండర్లే…?

సాధారణంగా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఏడాదికి 6 నుంచి 9 సిలిండర్లు మాత్రమే వినియోగిస్తారని అధికారులు చెబుతున్నారు. అయితే హోటళ్లలో రోజుకు ఒక్కో సిలిండర్ వినియోగం జరుగుతున్నట్లు సమాచారం రావడం అనుమానాలకు తావిస్తోంది.

కమర్షియల్ కనెక్షన్లు 100కు పైగా..

సంబంధిత గ్యాస్ ఏజెన్సీ పరిధిలో 100కు పైగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. అయితే హోటళ్లలో కమర్షియల్ సిలిండర్ల వినియోగం కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మండల పరిధిలో ఉన్న కమర్షియల్ కనెక్షన్లలో ఎంత మంది నిజంగా వినియోగం చేస్తున్నారు..? హోటళ్లు కమర్షియల్ గ్యాస్ వాడుతున్నాయా..? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని స్థానికులు అంటున్నారు..

అధికారుల మొద్దు నిద్ర..?

ఇల్లంతకుంటలో హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగం బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ వినియోగంపై సంబంధిత అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ముడుపుల వ్యవహారం ఉందా..? ఉంటే ఎవరి వాటా ఎంత..? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

గ్యాస్ కొరత భయం

ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో డొమెస్టిక్ గ్యాస్‌ను హోటళ్లలో వినియోగించడం వల్ల సాధారణ వినియోగదారులకు గ్యాస్ కొరత తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాకు సంబంధం లేదు: డీలర్ భారత్ గ్యాస్

ఇల్లంతకుంటలో హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగంపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన గ్యాస్ డీలర్ మాత్రం దీనితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. డొమెస్టిక్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే సిలిండర్లు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story