బ్యాంకర్ల బ్లాక్​మెయిల్​...రైతుల ఖాతాలు బ్లాక్​

by velandi.Saikiran |   (  Updated:2026-03-22 23:15:20  IST  )

ఊటూర్ ఎస్బీఐ బ్యాంకు అధికారులు క్రాప్ లోన్ పెండింగ్ లో ఉందంటూ సుమారుగా 200 మంది రైతుల ఖాతాలను బ్లాక్ చేయడం అన్నదాతల్లో ఆందోళనకు కారణమవుతుంది.

బ్యాంకర్ల బ్లాక్​మెయిల్​...రైతుల ఖాతాలు బ్లాక్​
X

బ్యాంకర్ల బ్లాక్​మెయిల్​

క్రాప్​లోన్​పెండింగ్​ అంటూ

రైతుల ఖాతాలు బ్లాక్​

రైతుభరోసా అందదని అన్నదాతల అవేదన

పొదుపు డబ్బులు తీసుకునేందుకు మూడు నెలలుగా నరకయాతన

దిశ, మానకొండూర్ : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను అమలు చేస్తుంటే బ్యాంకు అధికారులు మాత్రం పథకాలు రైతులకు చేరకుండా అడ్డంకులు సృష్టించడం అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు అధికారుల తీరుతో రైతులు మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నారు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు కల్తీ విత్తనాలు ఎరువులతో నష్టాల ఊబీలో కూరుకుపోతున్న అన్నదాతలకు బ్యాంక్ అదికారులతీరు గుదిబండలా తయారైంది. రైతులకు ప్రభుత్వం రుణ మాఫీ చేసి ఊరట కలిగించినా ఊరుకునేది లేదంటూ బ్యాంకు అధికారులు రైతుల వ్యక్తిగత ఖాతాలను బ్లాక్ చేసి మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతుండటం అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయగా బ్యాంకు అధికారులు ఖాతాలు బ్లాక్ చేసిన రైతులకు అందకుండా పోవడంతో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా రైతుల పరిస్థితి నెలకొంది.

200 మంది రైతుల ఖాతాలు బ్లాక్

ప్రభుత్వం రుణ మాఫీ చేసి అప్పులనుంచి అన్నదాతలకు విముక్తి కలిగించిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ ఎస్బీఐ బ్యాంకు అధికారులు క్రాప్ లోన్ పెండింగ్ లో ఉందంటూ సుమారుగా 200 మంది రైతుల ఖాతాలను బ్లాక్ చేయడం అన్నదాతల్లో ఆందోళనకు కారణమవుతుంది. అయితే క్రాప్ లోన్ ఖాతాలతో పాటు వాటికి ఫోన్ నంబర్​కు లింకు అయినా ఖాతాలను బ్లాక్ చేయడంతో రైతులు తమ అవసరాలు తీర్చుకునేందుకు పొదుపు చేసుకున్న డబ్బులను సైతం వాడుకోలేని దుస్థితి నెలకొంది. అకౌంటు బ్లాకు చేయడంతో రైతుల సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపి ఎక్కడా అప్పు పుట్టకపోగా మూడు నెలలుగా రైతులు తమ వ్యవసాయ అవసరాలను తీర్చుకునేందుకు నానాయాతనా పడుతున్నారు. తాజాగా ప్రభుత్వం చేసే పెట్టుబడి సాయం కూడా అందకుండా పోవడం పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

క్రాప్ లోన్ సాకుతో 'సేవింగ్స్'పై వేటు

రుణమాఫీ అవుతుందన్న ఆశతో కొందరు రైతులు తమ క్రాప్ లోన్లను సకాలంలో రెన్యూవల్ చేసుకోలేదు. ఇదే అదనుగా భావించిన ఊటూర్ ఎస్బీఐ అధికారులు ఏకంగా రైతుల వ్యక్తిగత సేవింగ్ అకౌంట్లను బ్లాక్ చేశారు. రైతు భరోసా డబ్బులు పడినా, వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా చేయడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ‘పెట్టుబడి కోసం అప్పులు చేశాం, ఇప్పుడు కనీసం పిల్లల చదువుల ఫీజులకు, పండుగకు కూడా పైసలు తీసుకోలేని స్థితిలో ఉన్నాం. మా సొంత డబ్బులను అడ్డుకోవడానికి బ్యాంకు వారికి అధికారం ఎక్కడిది?’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐదు గ్రామాల్లో అన్నదాతల ఆందోళన

ఊటూర్ ఎస్బీఐ బ్రాంచ్ పరిధిలోని పచ్చునూరు, మద్దికుంట, పోచంపల్లి, కెళ్లేడు, మామిడాలపల్లి, వేగురుపల్లి తదితర గ్రామాల రైతులు తమ సేవింగ్ ఖాతాలను తెరచి తమ లావాదేవీలు చేస్తున్నారు. తమ వ్యవసాయ అవసరాలకోసం క్రాఫ్ లోన్ లు సైతం ఎస్ బీఐ బ్యాంకులోనే పొందారు. గత రెండు దఫాలుగా ఒక్కసారి రెండే ళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం తాజా కాంగ్రెస్​ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసింది. అయినప్పటికీ రుణాలు పెండింగ్ ఉన్నాయంటూ సుమారుగా 200 మంది రైతుల సేవింగ్ అకౌంట్స్ బ్లాక్ చేయడంతో పెట్టుబడి అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు రైతులు మూడునెలలుగా అవస్థలు పడుతున్నారు. రైతులు బ్యాంకు అధికారులను ప్రాధేయపడ్డా కనికరించకపోవడంతో కుమిలిపోతున్న రైతులు తాజాగా ప్రభుత్వం అందించే రైతు భరోసాకూడ అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

భాజాప్తా బ్లాక్ చేస్తాం

మహేందర్ ఇస్లావత్ ఎస్ బీఐ మేనేజర్: '

రైతుల సేవింగ్ అకౌంట్స్ బ్లాక్ చేయడం పై మేనేజర్‌ను వివరణ కోరగా,. క్రాప్ లోన్ రెన్యూవల్ చేయని సుమారుగా 200 మంది రైతుల ఖాతాలు బ్లాక్ చేశాం. వారి ఖాతాలను బ్లాక్ చేసే అధికారం మాకు ఉందని, అందుకు పై అధికారుల ఆదేశాలు కూడా ఉన్నాయని అన్నారు. ఒకవేళ కట్టడానికి డబ్బులు లేకపోతే లోన్ పెంచి మరీ మేమే కట్టుకుంటామని చెప్పడం గమనార్హం. అంటే, రైతును మరింత అప్పుల ఊబీలోకి నెట్టడమే బ్యాంకుల లక్ష్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలి

అంబటి జోజిరెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకులు

రైతుల సేవింగ్ అకౌంట్స్ బ్లాక్ చేసి వేధిస్తున్న ఊటూర్ ఎస్బీఐ బ్యాంకు అదికారులపై చర్యలు తీసుకోవాలి. బ్లాక్ చేసిన అకౌంట్లను వినియోగం లోకి వచ్చేలా చేయాలి. ఇప్పటికే రైతులు నష్టాల ఊబీలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యం అంటూ జీవనం సాగిస్తుంటే బ్యాంక్ అధికారులు ఖాతాలు బ్లాక్ చేసి వేధించడం దారుణం. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఊటూర్ బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని విజ్నప్తి చేస్తున్నాం. అధికారులు స్పందించకపోతే బాధిత రైతులతో ఆందోళన చేపడతాం

Next Story