- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రావణకాష్టంలా డంప్ యార్డ్, పొగచూరిన కరీంనగర్ నగరం.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి
కరీంనగర్ డంప్ యార్డ్ నుంచి దట్టమైన పొగ! ఊపిరాడక జనం అల్లాడుతున్నా పట్టించుకోని పాలకులు. ఎన్నికల హామీలకే పరిమితమైన పరిష్కారం.

దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరాన్ని (కారుమబ్బులు)కాలుష్యం కమ్మేస్తోంది. నగర శివారులో ఉన్న డంప్ యార్డ్ రావణకాష్టంలా కాలుతూనే ఉంది. మంటలు ఎగసి పడుతుండటంతో ఆ మంటల నుంచి వచ్చే పొగ నగరాన్ని ఆవరిస్తుంది. క్రమేణ డంప్ యార్డు కంపు నగరం అంతా విస్తరించడంతో నగరవాసులు కమ్మేస్తున్న కాలుష్యంతో శ్వాస తీసుకోవాలి అంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనారోగ్యానికి గురవుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఏమైంది ఈ నగరానికి పాలకుల మాటలు ఎన్నికల హమీలుగా మిగిలిపోయాయి. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ ప్రజలు పాలకులను ప్రశ్నిస్తున్నారు.
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న డంప్ యార్డ్
కరీంనగర్ నగరవాసులను నగర శివారులో ఉన్న డంప్ యార్డు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. డంప్ యార్డులో ఎగిసిపడుతున్న మంటలతో వెలువడుతున్న దట్టమైన పొగతో సమీప కాలనీవాసులకు నగర జనజీవనానికి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. డంప్ యార్డు పై కేంద్రం ఇచ్చిన హామీ నీటి మూఠగా మిగిలిపోగా... రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం తో డంప్ యార్డు సమస్య ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. గత బీఆర్ఎస్ పాలనలో డంప్ యార్డు సమస్యకు చెక్ పెట్టాలని గత ప్రభుత్వ పాలకులు ప్రగల్భాలు పలికినా అవి అమలుకు నోచుకోకపోవడం...ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కరీంనగర్ వాసులు రోగాల బారిన పడి నరకాన్ని చూస్తున్నారు. నగర వాసులకు చుక్కలు చూపిస్తూ... అనారోగ్య సమస్యలతో ఇబ్బందుల పాలు చేస్తున్న కరీంనగర్ డంప్ యార్డు.. నగరంలోకి వస్తున్న జనానికి కంపు కరీంనగర్ అంటూ పొగతో స్వాగతం పలుకుతుంది.
రావణ కాష్టం లా కాలుతున్న డంప్ యార్డు
ఒక వైపు కరీంనగర్ నగరానికి కంపుతో స్వాగతం పలుకుతున్న డంప్ యార్డ్ రావణకాష్టంలా ఎగిసి పడుతున్న అగ్ని జ్వాలలతో వెలువడుతున్న పొగమంచులా నగరాన్ని కమ్మేస్తూ నగరవాసులను అనారోగ్యాల బారిన పడేస్తుంది. గతంలో కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు నేటీకి అమలుకు నోచుకోకపోవడంతో అవి ఎన్నికల హామీలుగానే మిగిలిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ప్రజా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గత ప్రభుత్వం డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చెత్తను పునర్వినియోగించేందుకు బయోమైనింగ్ చేపట్టిన అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
కంపు యార్డును తరలించండి
నగరంలో రాత్రి వేళలో తిరగాలి అంటే హెడ్ లైట్ల వెలుగులో కూడ మసక మసక బారినట్లు కనిపిస్తున్న పరిస్థితి. ఓ వైపు ఎండల తీవ్రత ఉక్కపోతలతో ఇబ్బందిపడుతున్న నగరవాసులకు నగరమంతా పొగ విస్తరించడంతో ఈ పొగమంచు ఎక్కడిదంటూ నగర వాసులు విస్తూపోతున్న పరిస్థితులు.. అయితే పొగమంచుతో పాటు కాస్త ఘాటుగా... వెగటుగా వాసన రావడం... గొంతు పట్టేసినట్టుగా అనిపించడంతో నగర వాసులు ఇది పొగమంచు కాదు కరీంనగర్ బైపాస్ రోడ్డులో రావణకాష్టంలా మండుతున్న డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగ అని డంప్ యార్డు వెదజల్లుతున్న దుర్గంధం నుంచి నగరవాసులను కాపాడాలి అంటు జనం రోడ్డేక్కుతున్నారు.
ప్రచార ఆర్బాటంగా బయో మైనింగ్..
గత పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడంతో బయోమైనింగ్ కాస్త ప్రచార ఆర్బాటంగా మిగిలి ఆరంభ శూరత్వం అన్నట్లుగా తయారైంది. డంప్ యార్డులో పేరుకుపోయిన చెత్తను పునర్వినియోగం చేయాలనే లక్ష్యంతో బయో మైనింగ్ చేయాలని నిర్ణయించి గత 2022 సంవత్సరంలో... సుమారు రూ.16 కోట్ల స్మార్ట్ సిటీ నిధులను కేటాయించి... ఆధునిక మెషినరీతో బయో మైనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. తొలుత బయో మైనింగ్ ప్రక్రియ జరిగిన తీరు చూస్తే... దశాబ్దాల కాలంగా గుట్టలుగా పేరుకుపోయిన... చెత్తకుప్పలు రోజుల్లోనే కరిగిపోతాయని భావించారు అంతా... కానీ అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఎలా అనుకున్నారో ఏమో నాయకులు... ఇంతలోనే స్పీడ్ గా కొనసాగుతున్న బయో మైనింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు... అధికారం మారడం... బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగి... కాంగ్రెస్ అధికారంలోకి రావడం... సరైన కాలంలో బయో మైనింగ్ ప్రక్రియ సాగిస్తున్న కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించక పోవడంతో... మైనింగ్ ప్రక్రియ కుంటుపడింది.
రోగాల బారిన నగరవాసులు
డంపింగ్ యార్డువల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడి స్థానికులు శ్వాసకోశ ఇబ్బందులు... చర్మ వ్యాధులు... సైనస్ వంటి తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారంటూ వైద్యులు చెబుతున్నారు. చెత్త నిల్వలతో దుర్వాసన, దోమలు,ఈగలు పెరగడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమై అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అంటున్నారు. చెత్త కాలడం వల్ల వచ్చే దట్టమైన పొగ విషపూరిత వాయువుల వల్ల అస్తమా బ్రోన్కైటిస్... సైనస్ లాంటి సమస్యలు వస్తాయంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు
అమలుకాని కేంద్ర మంత్రుల హమీలు
గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ డంప్ యార్డును ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. గత 2025 వ సంవత్సరం జనవరిలో డంప్ ను యార్డును సందర్శించిన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్... కరీంనగర్ వాసులను ఇబ్బంది పెడుతున్న డంప్ యార్డును తరలిస్తామని హామీ ఇవ్వగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం... బీజేపీకి మేయర్ పీఠం కట్టబెడితే డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు నగరవాసుల్లో ఆశలను రేకెత్తించాయి. దీంతో బీజేపీ అభ్యర్థులను గెలిపించి కార్పొరేటర్లుగా మున్సిపాలిటీకి పంపించారు. అయితే... బీజేపీ అభ్యర్థి మేయర్ అయి రోజులు గడిచిపోతున్నాయే తప్ప ఇప్పటివరకు డంప్ యార్డు పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది
స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
గత మార్చి నెలలో మంత్రి పొన్నం సైతం... స్థానిక నేతలతో కలిసి డంప్ యార్డును సందర్శించారు. డంప్ యార్డులో శిథిలావస్థకు చేరిన మెషినరీని పరిశీలించారు. చెడిపోయిన మెషనరీ స్థానంలో లెటేస్ట్ మోడల్ మిషన్లు తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏడాదిలోపు ఇక్కడి చెత్తను తరలిస్తామని చెప్పారు. అయితే... చెప్పి రోజులు గడుస్తున్నా దాని పై ఉలుకు లేకుండా పోయింది. ఇప్పటికైనా పాలకులు డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి... కరీంనగర్ అంటే ఇల్ నెస్ సిటీ కాదు హెల్దీ సిటీగా మార్చాలని కోరుకుంటున్నారు . ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిద్దాం...






