- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిరిసిల్ల కేటీఆర్ అడ్డా.. ఎగిరిన గులాబీ జెండా..!
“సిరిసిల్ల గడ్డ కేటీఆర్ అడ్డ” అన్న నినాదం మరోసారి ఘనంగా మార్మోగింది. సిరిసిల్ల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : “సిరిసిల్ల గడ్డ కేటీఆర్ అడ్డ” అన్న నినాదం మరోసారి ఘనంగా మార్మోగింది. సిరిసిల్ల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. పట్టణ ప్రజలు మరోసారి కారు గుర్తుకే మద్దతు తెలుపుతూ భారత రాష్ట్ర సమితికి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించారు. మొత్తం 39 వార్డులకు గాను 27 వార్డులను కైవసం చేసుకుని బీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు వెల్లడైన వెంటనే పట్టణంలో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కాగా అధికార పార్టీ కాంగ్రెస్ 6, బీజేపీ 5 స్థానాలు పరిమితం కాగా ఒక్క స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
ఫలించిన కేటీఆర్ వ్యూహం..
ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలన్న లక్ష్యంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ వర్క్‌స్ట్రాటజీని సూటిగా అమలు చేయడం ఈ విజయానికి కీలకమైందని రాజకీయ వర్గాల విశ్లేషించుకుంటున్నాయి . వార్డు వారీ సమీకరణాలు, అసంతృప్తులను చక్కదిద్దడం, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రత్యర్థుల బలహీనతలను సరిగ్గా అంచనా వేయడం ఇవి అన్నీ కలిసి గులాబీ పార్టీకే అనుకూల గాలి తీసుకువచ్చాయి. దాంతోపాటు కేటీఆర్ సిరిసిల్లలో మూడుసార్లు పర్యటించడం రెండు రాత్రులు ఇక్కడే ఉండి ప్రచార నిర్వహించడం ఈ మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారింది.
కాంగ్రెస్‌కు నిరాశ
అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కేవలం 6 వార్డుల్లో మాత్రమే గెలుపొందడం గమనార్హం. పట్టణస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీగా ఉన్నప్పటికీ బలమైన ప్రత్యామ్నాయం చూపించలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ వివాదాలు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బిఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చాయన్న చర్చ కొనసాగుతోంది.
5 వార్డుల్లో బీజేపీ, ఒక్క స్వతంత్ర అభ్యర్థి
గతంతో పోల్చుకుంటే బిజెపికి మెరుగైన స్థానాలే వచ్చాయి. బీజేపీ 5 వార్డుల్లో గెలుపొందగా, 10వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బొలగం వైష్ణవి నాగరాజు విజయం సాధించారు. అయితే మొత్తం దృష్ట్యా బల్దియాపై పూర్తి పట్టు మాత్రం బీఆర్‌ఎస్‌కే దక్కింది. అయితే 16వ వార్డులో చెల్లెలు గుజ్జ తారపై బిఆర్ఎస్ అభ్యర్థి గుండ్ల శ్రీనివాస్ గెలుపొందారు. 2 14 వార్డులలో బిజెపి నుండి పోటీ చేసిన అన్నా, చెల్లెల్లు దుమాల శ్రీకాంత్, పోకల భవాని ఓటమిపాలయ్యారు. అలాగే 26, 24 వార్డులలో బిజెపి నుంచి పోటీ చేసిన భార్యాభర్తలు గుంటుక కోటేశ్వర్, మంజుల ఓటమిపాలవడం విశేషం.
బల్దియాలో గులాబీ హవా
27 వార్డుల ఆధిక్యంతో చైర్‌పర్సన్ పదవి కూడా బీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. సిరిసిల్ల పట్టణ రాజకీయాల్లో మరోసారి గులాబీ హవా కొనసాగుతోందని ఫలితాలు స్పష్టం చేశాయి. మొత్తానికి, “సిరిసిల్ల గడ్డ కేటీఆర్ అడ్డ” అన్న నినాదం ఈ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ సిరిసిల్లలో నెలకొంది.






