నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి

by velandi.Saikiran |

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ సెంటర్, మీడియా సెల్ ను ఏర్పాటు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలలో అధికారులు విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల విధులపై జోనల్ ఆఫీసర్స్, ఎఫ్ ఎస్టీ, ఎస్ ఎస్టీ టీంలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికీ సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపిణీని గుర్తించడం, రిపోర్ట్ చేయడం ఆధారాలు సేకరించడం, వీడియో రికార్డు చేయడం చాలా కీలకమని, ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఏ మాత్రం నిర్లక్షం ప్రదర్శించవద్దని

సూచించారు. వీటికి సంబంధించిన అన్ని వివరాలతో సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టడమే లక్ష్యమని, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలని సూచించారు. నగదు సీజ్ చేసే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, నగదు సీజ్ చేసే సమయంలో ఎక్కడ అప్పీల్ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రశీదు అందించాలని పేర్కొన్నారు.

నగదు సీజ్ చేసిన సమాచారం ఐటీ అధికారులకు ఇవ్వాలని సూచించారు. సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వినియో గించిన వాహనాలు, కుర్చీలు, భోజనం తదితర ప్రతి అంశాన్ని పరిశీలించి వివరాలు నమోదు, రికార్డ్ చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తరువాత రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం పట్టుకున్న డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ప్రచార వాహనాలకు మున్సిపల్ కమిషనర్లు, లౌడ్ స్పీకర్లకు పోలీస్ ల నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు సమీప ఎస్ హెచ్ ఓ ల నుంచి ఎన్ఓసీ తీసుకున్న తర్వాత మున్సిపల్ కమిషనర్ అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.

ప్రతి వార్డు సభ్యుడు రూ. లక్ష వరకు ఎన్నికల వ్యయం చేయవచ్చని వెల్లడించారు. జోనల్ ఆఫీసర్స్ తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడు సార్లు తనిఖీ చేయాలని సూచించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ వినియోగంలో ఉన్నాయా చూడాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, నోడల్ అధికారులు గీత, శ్రీనివాసాచారి, నవీన్, ట్రైనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెల్ప్ లైన్ సెంటర్, కంట్రోల్ రూమ్, మీడియా సెల్ ఏర్పాటు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ సెంటర్, మీడియా సెల్ ను ఏర్పాటు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ సెంటర్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, మీడియా సెల్ ను అదనపు కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్ ప్రసారమైన, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తికి, సమాచారం కోసం సంప్రదించిన వెంటనే స్పందించాలని సూచించారు. ఎన్నికల ఫిర్యాదుల ఉంటే ప్రజలు కంట్రోల్ రూం నెంబర్ 1800 233 1495 అందుబాటులో ఉంటుందని, ఫోన్ చేసి చెప్పవచ్చని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు గీత, శ్రీనివాసాచారి, నవీన్, భారతి తదితరులు పాల్గొన్నారు.

Next Story