సిరిసిల్ల సెస్‌లో రికార్డుల దగ్ధం: విచారణలో రాజకీయ ఒత్తిళ్లు?

by Naga Rani Yarlagadda |

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) కార్యాలయంలో కొంతకాలం కింద జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొరవడినట్లు స్పష్టమవుతోంది.

సిరిసిల్ల సెస్‌లో రికార్డుల దగ్ధం: విచారణలో రాజకీయ ఒత్తిళ్లు?
X

దిశ ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) కార్యాలయంలో కొంతకాలం కింద జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొరవడినట్లు స్పష్టమవుతోంది. ఆ ఘటనలో సెస్‌కు సంబంధించిన అతి కీలకమైన రికార్డులు దగ్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్లు పూర్తిగా కాలిపోవడంపై అనుమానాలు రేకెత్తాయి. ఈ ఘటన జరిగి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు. బాధ్యులను కాపాడేందుకే పోలీసు శాఖపై సెస్ పాలకవర్గం ఒత్తిడి చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే ఆ అగ్ని ప్రమాద ఘటన మరుగున పడిందనే వాదనలు గుప్పుమంటున్నాయి. కేసు విచారణ ముందుకు సాగేది ఎన్నడు..? బాధ్యులపై చర్యలు తీసుకునేది ఎప్పుడోనని అటు వినియోగదారులు, ఇటు జిల్లా ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.

అగ్ని ప్రమాదంలో రికార్డులు దగ్ధం

2023 నవంబర్ నెలలో వచ్చిన దీపావళి పండగ నేపథ్యంలో కార్యాలయంలో విధులు నిర్వర్తించే కొంతమంది ఉద్యోగులు, డైరెక్టర్లు కార్యాలయ ఆవరణలో టపాసులు కాల్చడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో కార్యాలయంలోని రికార్డు గదిలోని పలు ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయి. అంతేకాకుండా కొన్ని రూ.లక్షల నష్టం వాటిల్లింది. అయితే ఈ ప్రమాదం జరగకపోతే కొద్ది రోజుల తరువాత సెస్‌లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆడిటింగ్‌లో భాగంగా విజిలెన్స్ అధికారులు రికార్డుల పరిశీలన ఉండేది. కాగా, సెస్ పాలకవర్గం, అధికారులు చేసిన అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఈ అగ్ని ప్రమాదానికి తెరలేపారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీపావళి పండుగ వేడుకల్లో సెస్ చైర్మన్, వైస్ చైర్మన్ తోపాటు ఎండీ కూడా పాల్గొనకపోవడం ఈ అగ్ని ప్రమాదం కావాలనే చేశారనే వాదనకు బలాన్నిచ్చాయి. అంతేకాకుండా కార్యాలయ ఆవరణలో టపాసులు కాల్చకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, టపాసులు కాల్చిన ఉద్యోగులపై పాలకవర్గం చర్యలు తీసుకోకపోవడం కూడా పలు అనుమానాలకు దారితీసింది.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) రాష్ట్రంలో కొనసాగుతున్న ఏకైక విద్యుత్ సహకార సంస్థ. అయితే సెస్‌లో జరిగే ఏ చిన్న విషయమైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే సెస్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో సెస్ పాలకవర్గం జరిగిన ఘటనకు కారణమైన బాధ్యులను గుర్తించాలని సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా రాజకీయ ఒత్తిళ్ల కారణంతో పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

ఏడాదిన్నరగా ముందుకు సాగని విచారణ

ఇదిలా ఉండగా సెస్ పాలకవర్గం కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఏడాదిన్నర గడుస్తున్నా విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు. అగ్ని ప్రమాదానికి కారణమైన బాధ్యులు ఎవరనేది పోలీసులు నిగ్గు తేల్చలేదు. పాలకవర్గం మాత్రం అప్పుడు వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చడానికే ఫిర్యాదు చేశారని, ప్రమాదంలో అధికారులు, సిబ్బందితోపాటు తమకు భాగస్వామ్యం ఉండడం మూలంగానే పాలకవర్గం పోలీసులపై ఒత్తిడి తీసుకురాలేదని సెస్ ఉద్యోగ వర్గంతోపాటు వినియోగదారులు బహిరంగంగానే చెవులు కోరుకుంటున్నారు. పోలీస్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే సెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరుగున పడిందని జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఈ అగ్ని ప్రమాదానికి కారణమైన బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులతోపాటు జిల్లా ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.

విచారణ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది : గున్నాల లక్ష్మణ్, వినియోగదారుడు

సిరిసిల్ల సెస్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద విచారణను పాలకవర్గం నిర్వీర్యం చేసే కుట్ర చేసింది. చిన్న సంఘటనల్లో చర్యలు తీసుకునే పాలకవర్గం, బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ పోలీసుల పేరుతో పక్కదారి పట్టిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఏడాదిన్నర తరువాత ఎన్పీడీసీఎల్ సీఎండీకి విచారణ జరపాలని పాలకవర్గం లేఖ రాయడం విడ్డూరంగా ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం జోక్యం కల్పించుకుని విజిలెన్స్ అధికారులతో సమగ్ర విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకొని సెస్ అభ్యున్నతికి తోడ్పడాలి.

దోషులు తేలిన వెంటనే చర్యలు తీసుకుంటాం

సెస్ కార్యాలయంలో ఏడాదిన్నర కింద అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పాలకవర్గం సమావేశమై సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు పోలీసుల నుంచి బాధ్యులు ఎవరనేది ఎలాంటి స్పష్టత రాలేదు. అలాగే ఆరు రోజుల కింద ఎన్పీడీసీఎల్ సీఎండీకి అగ్ని ప్రమాదంపై విచారణ జరపాలని పాలకవర్గం తరపున లేఖ రాశాం. విచారణ అనంతరం అగ్ని ప్రమాదానికి కారణమైన దోషులు ఎవరనేది తేలిన వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే అగ్ని ప్రమాదంలో కీలకమైన రికార్డులు దగ్ధమయ్యాయనేది అవాస్తవం. రికార్డులకు సంబంధించిన పూర్తి డేటా కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఉంది. - చిక్కాల రామారావు, చైర్మన్, సెస్

Next Story