నల్ల బంగారు గనుల్లో చీకటి దందా.. నిఘా నీడలోనే భారీ దోపిడీ

by Naga Rani Yarlagadda |

దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచే నల్ల బంగారు గనుల్లో ఇప్పుడు చీకటి దందా రాజ్యమేలుతోంది.

నల్ల బంగారు గనుల్లో చీకటి దందా.. నిఘా నీడలోనే భారీ దోపిడీ
X

దిశ, పెద్దపల్లి/కమాన్ పూర్ : దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచే నల్ల బంగారు గనుల్లో ఇప్పుడు చీకటి దందా రాజ్యమేలుతోంది. ప్రజాధనం పగటి పూటే అన్యాక్రాంతం అవుతోంది. భద్రతా వలయాలను ఛేదించుకుని, కట్టుదిట్టమైన నిఘా నీడలో ఉండాల్సిన కోట్లాది రూపాయల యంత్రాల విడిభాగాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని సింగరేణి గనుల్లో వెలుగు చూసిన ఓ భారీ చోరీ ఘటన వ్యవస్థలోని డొల్లతనాన్ని, అంతర్గత అవినీతిని బట్టబయలు చేస్తోంది. రామగుండం రీజియన్-3 పరిధిలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టిని తవ్వేందుకు వినియోగించే భారీ 'డ్రాగ్‌లైన్ ఎక్స్కవేటర్‌'కు చెందిన కాపర్ వైర్లు రాత్రికి రాత్రే అదృశ్యమయ్యాయి. మార్కెట్లో వీటి అంచనా విలువ అక్షరాలా కోటి ముప్పై లక్షల రూపాయలు (రూ. 1.30 కోట్లు). ఇంత భారీ పరిమాణంలో బరువుగా ఉండే ఈ కేబుల్స్ సాధారణంగా అత్యంత కఠినమైన భద్రత మధ్య ఉంటాయి. అలాంటిది, ఈ వైర్లు ఎవరి కంటా పడకుండా ఎలా మాయం అయ్యాయన్నది ఇప్పుడు సింగరేణి వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అంతర్గత సహకారం లేకుండానే..

ఒక సూది కిందపడితేనే ఇట్టే పట్టేసే సీసీటీవీల నిఘా వ్యవస్థ, రౌండ్ ద క్లాక్ పహారా కాసే సెక్యూరిటీ గార్డులు సింగరేణి సొంతం. మరి ఇంతటి భద్రతను దాటుకుని టన్నుల కొద్దీ ఉండే కాపర్ వైర్లను తరలించడం సామాన్యులకు సాధ్యమయ్యే పనేనా? అని కార్మిక సంఘాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.ఇటీవల కాలంలో సింగరేణి గనుల్లో స్క్రాప్, కాపర్ కేబుల్స్ చోరీలు నిత్యకృత్యంగా మారాయి. దొంగలు అత్యంత యాక్టివ్‌గా, ఒక వ్యవస్థీకృత ముఠాలా ఏర్పడి ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు పలు అంతర్గత నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చోరీలను అడ్డుకోబోయిన నిజాయితీ గల భద్రతా సిబ్బందిపై దొంగలు భౌతిక దాడులకు సైతం వెనుకాడటం లేదంటే.. అక్కడ పరిస్థితులు ఎంతలా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.

పోలీస్ కంప్లైంట్ ఏదీ..?

ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ జరిగినప్పటికీ, సింగరేణి యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. అధికారికంగా కనీసం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన దాఖలాలు గానీ, విజిలెన్స్ విచారణకు ఆదేశించిన వివరాలు గానీ బహిర్గతం కాలేదు. ఇది కేవలం చోరీనా? లేక కొందరు పెద్ద తలకాయలు కలిసి చేసిన 'భారీ స్కామా?' అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఫిర్యాదు చేయకపోవడం వెనుక వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల సింగరేణి ఆస్తి ఇలా అనాథలా దోపిడీకి గురవ్వడం భద్రతా వైఫల్యాలకు నిలువెత్తు అద్దం పడుతోంది. కేవలం చిన్నపాటి దొంగల పనిగా దీనిని కొట్టిపారేయకుండా, వెనుక ఉన్న అసలు సూత్రధారులను లాగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులతో పాటు, చోరీకి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story