- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఆమెనే... పాలన మాత్రం భర్తదే! కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
గంగాధర మండలంలోని నారాయణపూర్ పంచాయతీలో ప్రజాప్రతినిధికి బదులుగా సర్పంచ్ భర్త ఏకపక్ష పాలన సాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

గంగాధర మండలంలోని నారాయణపూర్ పంచాయతీలో ప్రజాప్రతినిధికి బదులుగా సర్పంచ్ భర్త ఏకపక్ష పాలన సాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వార్డు సభ్యులను, ప్రజలను పక్కనపెట్టి అధికార హోదా లేని సర్పంచ్ భర్తే పంచాయతీ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. మౌలిక వసతులు, సమస్యలపై ప్రశ్నిస్తే ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ సదరు నాయకుడు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడని వాపోతున్నారు. సర్పంచ్ భర్త అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని నారాయణపూర్‌వాసులు కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీలో చట్టబద్ధమైన ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించి తమ సమస్యలు పరిష్కరించాలని యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలన్నీ అభివృద్ధిని ఓర్వలేక గిట్టనివారు చేస్తున్న రాజకీయ కుట్రలేనని స్థానిక సర్పంచ్ ఖండించారు.
దిశ, గంగాధర : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధుల పాలనకు బదులుగా ‘సర్పంచ్ భర్త రాజ్యం’ నడుస్తోందంటూ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన మహిళా సర్పంచ్ అధికారాలను ఆమె భర్త వినియోగిస్తూ గ్రామ పంచాయతీ వ్యవహారాలన్నింటినీ తన ఆధీనంలో నడిపిస్తున్నారని, వార్డు సభ్యులను పూర్తిగా పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ తీరుతో విసిగిపోయిన గ్రామ ప్రజలు చివరకు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అన్నింట్లో ఆయన పెత్తనమే..
గ్రామ పంచాయతీలో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులతో సమావేశాలు, ఇతర పరిపాలనా వ్యవహారాల్లో సర్పంచ్ కంటే ఆమె భర్తే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. పాలకవర్గ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాలకు ఆహ్వానించకపోవడం, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందని మండిపడుతున్నారు. గ్రామంలోని తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, సీసీ రోడ్ల సమస్యలపై ప్రశ్నించిన ప్రతిసారీ ‘నేను చేయను... ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు డిమాండ్..
ఎటువంటి అధికారిక హోదా లేకపోయినా సర్పంచ్ భర్త అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సర్పంచ్ భర్త అధికార దుర్వినియోగం, అక్రమ జోక్యంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన పునరుద్ధరించాలని కోరారు.
ఆరోపణల్లో వాస్తవం లేదు : సర్పంచ్
తనపై వస్తున్న ఆరోపణలన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని సర్పంచ్ స్పష్టం చేశారు. గ్రామంలో తమపై గిట్టని కొందరు వ్యక్తులు కావాలనే రాజకీయంగా దుష్ప్రచారం చేస్తూ బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధిని ఓర్వలేకనే ఇటువంటి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని, గ్రామ ప్రజలు ఎవరూ ఇటువంటి వదంతులను నమ్మవద్దని కోరారు.






