ఎన్నికల బరిలో 'సర్పంచ్' మోజు.. అప్పుల ఊబిలో అభ్యర్థులు

by Malleboina Mahesh |

ఎన్నికల్లో గెలుపు కోసం ఆస్తులు అమ్మి, లక్షల్లో ఖర్చు చేసిన అభ్యర్థులు ఇప్పుడు అప్పుల భయంతో వణికిపోతున్నారు. పదవి రాక, అప్పు తీరక కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఎన్నికల బరిలో సర్పంచ్ మోజు.. అప్పుల ఊబిలో అభ్యర్థులు
X

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్​గా పోటీ చేయాలనే 'మోజు తీరే.. అప్పులు మిగిలే` అంటూ గెలిచిన, ఓడిన అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. గ్రామాల్లో కొంత పలుకుబడి పేరున్న వ్యక్తులు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న నాయకులను ఆయా పార్టీ బరిలో దింపాయి. 'నిన్న మొన్న వచ్చినోళ్లు ఎదిగిపోయారు.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోటీ చేస్తావ్' అని పోటీకి ఉసిగొల్పారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థి కంటే ఎక్కువ ఖర్చు చేస్తేనే గెలుపు సాధ్యమవుతుందని పార్టీల నాయకులు, మిత్రుల సలహాలతో 'తగ్గేదే లే’ అంటూ విపరీతంగా ఖర్చు చేశారు. కానీ గ్రామాల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పుతో బరిలో ఓడిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

దిశ, కొత్తపల్లి : కరీంనగర్ జిల్లాలో 313. జగిత్యాల 379, పెద్దపల్లి 263, రాజన్న సిరిసిల్ల లో 252 గ్రామ పంచాయతీలు ఉండగా సుమారు 10 వేల వార్డులుకు గత డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ గా, వార్డు సభ్యులు, కౌన్సిలర్, కార్పొరేటర్లు‌గా గెలిచిన అభ్యర్థులు గెలిచామని కొంత సంతోషంగా ఉన్నా తెచ్చిన అప్పు ఎలా తీర్చాలనే సందిగ్ధంలో పడ్డారు. సర్పంచ్ గెలిచి నాలుగు నెలలు గడుస్తోంది. వారిలో అప్పు భయం రోజురోజుకూ పెరుగుతోంది. అప్పు ఇచ్చినవారు సమయం దగ్గర పడుతుంది కట్టాలని అడుగుతున్నారని కొందరు బయట ఎవరికీ చెప్పుకోలేక లోలోన మదన పడుతున్నారు. మరో వైపు ఓడిన అభ్యర్థులు ఫలితాల తర్వాత ఓటమి చెందడంతో వారికున్న భూములను తాకట్టు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి గ్రామానికి సేవ చేద్దామనుకుంటే ఉన్న భూములను అమ్ముకున్నామని ఓడిన అభ్యర్థులు మిత్రుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారని తెలుస్తోంది.

గ్రామాల్లో అంతటా ఇదే పరిస్థితి..

జిల్లావ్యాప్తంగా సగానికి పైగా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ బరిలో దిగేందుకు కొంతమంది భూమి తాకట్టు పెట్టి అప్పు తీసుకువచ్చినట్లు సమాచారం. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు పెడితే వార్డు సభ్యులు సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. డబ్బులు పంచిన ఓటర్లు తమకు మద్దతు ఇవ్వక మరొకరిని ఆదరించడంతో ఓటమి పాలైన వారు ఆందోళన చెందుతున్నారు.

అప్పుల ఊబీలో అభ్యర్థులు..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో చాలామంది బయట అప్పులు తీసుకురావడం, భూములు, బంగారం తాకట్టు పెట్టారు. లక్షల్లో అప్పులు తెచ్చి ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం చేశారు. గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి పాలవడంతో డబ్బులు పోయే, పదవి రాకపోయే అని తలలు పట్టుకుంటున్నారు. తమ శక్తికి మించి ఎన్నికల్లో భారీ సభలు, మందు, విందుతో పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన అభ్యర్థులు పరాజయం చెందడంతో ఆ కుటుంబాలకు ఎన్నికల అప్పులు మిగిలాయి. బయట తెచ్చిన అప్పులు, తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎలా విడిపించాలని ఆందోళన చెందుతున్నారు.

Next Story