యథేచ్ఛగా ఇసుక దోపిడీ.. రెచ్చిపోతున్న ఇసుకాసురులు

by Ajay Maddhiboyina |

జమ్మికుంట పట్టణంలో ఇసుక మాఫియా అడ్డుఅదుపు లేకుండా పెట్రేగిపోతోంది. చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమార్కులు అడ్డదారుల్లో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రభుత్వం టోకెన్లు నిలిపివేయడంతో వ్యాపారులు ఇసుక ధరలను ఆకాశాన్నంటించారు.

యథేచ్ఛగా ఇసుక దోపిడీ.. రెచ్చిపోతున్న ఇసుకాసురులు
X

జమ్మికుంట పట్టణంలో ఇసుక మాఫియా అడ్డుఅదుపు లేకుండా పెట్రేగిపోతోంది. చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమార్కులు అడ్డదారుల్లో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రభుత్వం టోకెన్లు నిలిపివేయడంతో వ్యాపారులు ఇసుక ధరలను ఆకాశాన్నంటించారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను దూరాన్ని బట్టి రూ.5వేల నుంచి రూ.7వేల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆదేశాలను ఖాతరు చేయకుండా క్షేత్రస్థాయిలో అక్రమాలకు పోలీసులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విలాసాగర్ ట్రాక్టర్ల యజమానులతో ఓ కానిస్టేబుల్ కుమ్మక్కై ఈ దందాను నడిపిస్తున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు.

- దిశ, జమ్మికుంట

దిశ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను అక్రమార్కులు పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. ఎలాంటి భయం లేకుండా నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లను వాడుతూ మైనర్లతో ఇసుక రవాణా చేయిస్తున్నారు. దళారులు ట్రాక్టర్ల లాక్‌లను తీసేసి, పట్టణ రోడ్లపై అధిక వేగంతో (ఓవర్ స్పీడ్) వాహనాలను నడుపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. జమ్మికుంట పరిసరాల నుంచి తోడేస్తున్న ఇసుకను పక్కనే ఉన్న కమలాపూర్, హుజూరాబాద్ మండలాలకు సైతం అక్రమంగా తరలిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.

చెక్ పోస్టులు పెట్టినా ఆగని దందా...

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు ఏమాత్రం ఫలించడం లేదు. మాఫియా శ్రేణులు అడ్డదారులను వెతుక్కుంటూ తనిఖీ కేంద్రాల కళ్లు గప్పి ఇసుకను తరలిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇసుక రవాణాకు టోకెన్లు ఇవ్వకపోవడాన్ని అక్రమ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇసుక రవాణాపై ఆంక్షలు ఉండడంతో కృత్రిమ కొరత సృష్టించి, ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచేశారు. జమ్మికుంట పరిధిలో ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.5వేల చొప్పున విక్రయిస్తుండగా.. కమలాపూర్, హుజూరాబాద్ ప్రాంతాలకు వెళ్లేసరికి రూ.7వేల వరకు వసూలు చేస్తున్నారు.

పోలీసుల సహకారంతోనేనా..?

ఇసుక ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అక్రమ రవాణాపై కఠినంగా ఉండాలని ఆదేశించినా, క్షేత్రస్థాయిలో కొందరు పోలీసులు ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక పోలీసుల అండదండలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున దందా సాగడం అసాధ్యమని ప్రజలు భావిస్తున్నారు. ఒక్కో ఇసుక ట్రాక్టర్ నుంచి రూ.200 చొప్పున మామూళ్లు తీసుకుంటూ వందలాది వాహనాలను వదిలేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విలాసాగర్ ప్రాంతానికి చెందిన కొందరు ట్రాక్టర్ యజమానులు, ఒక పోలీస్ కానిస్టేబుల్ కలిసి ఈ సిండికేట్‌ను నడిపిస్తున్నట్లు స్థానికంగా గట్టి ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాకు సహకరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జమ్మికుంట ప్రజలు కోరుతున్నారు.

Next Story