- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల ఐసీడీఎస్ అఫీస్ లో ఆర్జేడీ ఎంక్వయిరీ
రెండేళ్ల క్రితం వేధింపుల విషయంలో వచ్చిన ఫిర్యాదు పై శనివారం ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : రెండేళ్ల క్రితం వేధింపుల విషయంలో వచ్చిన ఫిర్యాదు పై శనివారం ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల ఓ ఆడియో క్లిప్ వైరల్ అయిన నేపథ్యంలో సీడీపీఓ కార్యాలయంలో అంగన్ వాడి సిబ్బంది పై వేధింపుల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీంతో మాతా శిశు సంక్షేమ శాఖ ఆర్జేడి ఝాన్సిలక్ష్మి శనివారం విచారణ నిర్వహించారు. 2024 నవంబర్ లో అప్పటి డీడబ్ల్యుఓ నరేష్‌పై ఆకాశ రామన్న పేరుతో ఉన్నతాధికారులకు లెటర్ రాశారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇటీవల ఆయన పై విమర్శలు చేస్తూ పేరు చెప్పకుండా ఆడియో టేప్ ద్వారా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మామూళ్ల పేరుతో తమను వేధిస్తున్నారంటూ ఆడియో టేప్ లో వివరించారు. నేరుగా ఫిర్యాదు చేస్తే తమను ఎక్కడ టార్గెట్ చేస్తారో అన్న భయంతోనే మరో ఆప్షన్ లేకనే ఆడియో రూపంలో అధికారుల వరకు చేరాలనే ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఉన్నతాధికారుల పట్ల పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎట్టకేలకు శనివారం ఇంచార్జీ డీడబ్ల్యూవో రాజ్ కుమార్ సమక్షంలో అంగన్ వాడీ సిబ్బందిని ఆర్జేడీ విచారించారు.
గత డీడబ్ల్యుఓ నరేష్ పై సంచలన ఆరోపణలు
గతంలో సస్పెన్షన్ కు గురైన పెగడపల్లి మండలం బతికేపల్లి అంగన్వాడీ వర్కర్ కొడిపల్లి జమున గత డీడబ్ల్యుఓ నరేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. 20 ఏళ్లుగా రిమార్క్ లేకుండా పనిచేసినా, గత ఏడాది జూలైలో కక్షపూరితంగా తనను టెర్మినేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఉద్యోగంలో కొనసాగాలంటే రూ. లక్ష ఇవ్వాలని అప్పటి డీడబ్ల్యూవో నరేష్ డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. అలాగే నరేష్ కూతురు పెళ్లి పేరుతో జిల్లా వ్యాప్తంగా అంగన్ వాడి సిబ్బంది నుంచి ఒక్కొక్కరికి రూ.500 చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు కూడా వెలువడ్డాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అంగన్ వాడి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. విచారణ జరిగిన తీరుపై పలువురు అంగన్ వాడి టీచర్లు అసహనం వ్యక్తం చేసారు. ఉన్నతాధికారులు తమను ఎక్కడ టార్గెట్ చేస్తారో అనే భయం తోనే నేరుగా ఫిర్యాదు చేయలేదని అలాంటప్పుడు విచారణ సందర్భంగా తమను తెల్ల కాగితంపై ఏం జరిగిందో వివరణ రాసి ఇవ్వమనడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు.






