జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు

by Ratna Kumari |

కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు పార్టీ నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు పార్టీ నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీకి జీవన్ రెడ్డి గుడ్ బై చెబుతారనే వార్తలకు తాజా పరిణామం మరింత బలాన్ని చేకూర్చుతుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న జీవన్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీతో ఉన్న 40 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి చెప్పే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో పాటు జిల్లాకు చెందిన మంత్రుల ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను జీవన్ రెడ్డి అనుచరులు తొలగించారు. ఇందిర భవన్ గా పేరు ఉన్న ఆయన నివాసం ఎదుట అసలు కాంగ్రెస్ ఆనవాళ్లు లేకుండా చేసారు. తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో ఉగాది శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ జీవన్ రెడ్డి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

పార్టీ హైకమాండ్ తీరు పై తీవ్ర అసంతృప్తి

ఎమ్మెల్యే సంజయ్ ఎపిసోడ్ పై ముందు నుంచి గుర్రుగా ఉన్న జీవన్ రెడ్డి పార్టీలో తన ప్రాధాన్యత తగ్గడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తోడు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వకపోవడం ,, చైర్పర్సన్ ఎన్నికలో ఆయన మాటను లెక్క చేయకపోవడన్ని ఘోర అవమానమని మీడియా ముఖంగానే తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నడుమ అవమానాలను భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగడం ఆలోచిస్తున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీ పెద్దల నుండి ఎలాంటి సంప్రదింపులు జరగకపోవడం ఆయనను మరింత కృంగ తీసింది. ఈ నేపథ్యంలో చివరకు పార్టీని వీడడం తప్ప తనకు మరో ఆప్షన్ లేదని భావించిన ఆయన ఈనెల 25వ తేదీన పార్టీకి రాజీనామా చేయనున్నట్లు జీవన్ రెడ్డి అనుచరులు తెలిపారు.

పార్టీలో ఒంటరైన జీవన్ రెడ్డి

కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన జీవన్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరడం ఆయనతో ఉన్న విభేదాల కారణంగా కనీసం జీవన్ రెడ్డితో మాట్లాడడానికి కూడా ఇతర నాయకులు జంకుతున్నారు. జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి వంటి వారు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదని జీవన్ రెడ్డి అనుచరులే చెబుతున్నారు. అయితే పార్టీలో జీవన్ రెడ్డికి వచ్చినన్ని అవకాశాలు మరే లీడర్ కు రాలేదని గత రెండు పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా నియోజకవర్గంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలే తప్ప ఆయన సీనియారిటీని అవమానించడం పార్టీ ఉద్దేశ్యం కాదని పార్టీలో ఉన్న మరికొందరు నాయకులు చెబుతున్నారు.

Next Story