- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం: మంత్రి అడ్లూరి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యే జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కృషితో వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలోని ఐదు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించామని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా రంగంలో మరిన్ని సంస్థలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామా అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1,289 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని, తెలంగాణలో 37 కేవీలు ఉన్నాయని తెలిపారు.
శాశ్వత భవనం పూర్తయ్యే వరకు..
జగిత్యాలకు కేవీ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సైనిక్ స్కూల్, కృషి విజ్ఞాన కేంద్రం కోసం కూడా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తమ ప్రసంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో విద్యా మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలోనే కేంద్రీయ విద్యాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్. దినేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి చలగల్ గ్రామ సర్పంచ్ జున్ను రాజేందర్, జగిత్యాల ఆర్.డి.ఓ. మధుసూదన్ ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






