- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధి నిర్వహణలో నిర్లక్ష్యం..సదాశివపేట ఎంపీడీవో లక్ష్మి సస్పెన్షన్
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సదాశివపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) లక్ష్మిపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సస్పెన్షన్ వేటు వేశారు.

దిశ, సదాశివపేట: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సదాశివపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) లక్ష్మిపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 8న కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన దృశ్య మాధ్యమ (వీడియో కాన్ఫరెన్స్) సమీక్ష సమావేశానికి సంబంధిత అధికారి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా గైర్హాజరైనట్లు గుర్తించిన కలెక్టర్, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు భావించి సస్పెన్షన్ చర్యలు చేపట్టారు. జిల్లా పరిపాలనలో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆదేశాలను పట్టించుకోకుండా గైర్హాజరుకావడాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. సదాశివపేట ఎంపీడీవో లక్ష్మితో పాటు జిల్లా పరిధిలోని మరికొంతమంది గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులపై కూడా ఇదే కారణంతో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, సమీక్ష సమావేశాలకు గైర్హాజరు, అధికారిక ఆదేశాలను పాటించకపోవడం వంటి అంశాలపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జిల్లాలో ప్రభుత్వ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు అధికారుల్లో బాధ్యతాయుతమైన విధి నిర్వహణను పెంపొందించే దిశగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.






