సీల్డ్ వాటర్ బాటిల్‌లో యాసిడ్..! దాహం తీర్చుకోబోయి మృత్యువుతో పోరాడుతున్న మహిళ!

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూత పెట్టిన బిస్లెరీ వాటర్ బాటిల్‌గా భావించి ఓ మహిళ తాగిన ద్రవం యాసిడ్‌గా తేలడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది.

సీల్డ్ వాటర్ బాటిల్‌లో యాసిడ్..! దాహం తీర్చుకోబోయి మృత్యువుతో పోరాడుతున్న మహిళ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూత పెట్టిన బిస్లెరీ వాటర్ బాటిల్‌గా భావించి ఓ మహిళ తాగిన ద్రవం యాసిడ్‌గా తేలడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేసు సంచలనంగా మారింది. బాధితురాలు రియా అనే టీచర్.. ఆమె గత శుక్రవారం సాయంత్రం హాపూర్‌లోని అర్జున్ నగర్ ప్రాంతంలోని ఓ నగల దుకాణానికి ఆభరణాలు కొనుగోలు చేయడానికి వెళ్లింది. దాహంగా ఉందని చెప్పడంతో దుకాణ సిబ్బంది సమీపంలోని స్వీట్ షాప్ నుంచి సీల్డ్ బిస్లెరీ వాటర్ బాటిల్ కొనుగోలు చేసి ఆమెకు అందించారు. బాటిల్ మూత తీసి ఒక్క గుక్క తాగిన వెంటనే రియాకు గొంతు, నోటిలో తీవ్రమైన మంట మొదలైంది. వెంటనే ఆమె నొప్పితో కేకలు వేస్తూ బయటకు పరుగెత్తి ద్రవాన్ని ఉమ్మేసింది. అనంతరం ఆమెను సమీప ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాటిల్‌ను విక్రయించిన స్వీట్ షాప్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే తాను ఫ్రీజర్‌లో ఉన్న సీల్డ్ బాటిళ్ల ప్యాక్‌లో నుంచి ఒకదాన్ని మాత్రమే ఇచ్చానని, అందులో యాసిడ్ ఉందని తమకు తెలియదని అతడు పోలీసులకు తెలిపాడు. నగల దుకాణ సిబ్బందికీ ఈ విషయం తెలియదని విచారణలో వెల్లడైంది. సీల్డ్ వాటర్ బాటిల్‌లో యాసిడ్ ఎలా చేరిందనే అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిర్లక్ష్యమా, పొరపాటా, లేక ఉద్దేశపూర్వకంగా బాటిల్‌తో ఎవరైనా చెలగాటం ఆడారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న అధికారులు, బాటిల్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఫోరెన్సిక్ నివేదికతో పాటు వైద్యుల నివేదిక వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Next Story