- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Credit Cards: ఒక్కటి కాదు.. ఇప్పుడు మూడు, నాలుగు క్రెడిట్ కార్డులు
ఇదే సమయంలో యాక్టివ్ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారి సంఖ్య 1.4 కోట్ల నుంచి 5.2 కోట్లకు, చలామణిలో ఉన్న మొత్తం కార్డులు 10.7 కోట్లకు పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రజలు రుణాలు తీసుకునే విధానంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. గతంలో ఒకే క్రెడిట్ కార్డుతో సరిపెట్టుకున్న వినియోగదారులు ఇప్పుడు రెండు, మూడు లేదా అంతకంటే ఎక్కువ కార్డులు ఉపయోగిస్తున్నారు. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, మూడు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగిన వారి వాటా 2016లో 12 శాతం ఉండగా, 2026 నాటికి 22 శాతానికి చేరింది. ఇదే సమయంలో యాక్టివ్ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారి సంఖ్య 1.4 కోట్ల నుంచి 5.2 కోట్లకు, చలామణిలో ఉన్న మొత్తం కార్డులు 10.7 కోట్లకు పెరిగాయి. క్రెడిట్ కార్డులపై ఉన్న మొత్తం బకాయిలు కూడా రూ.40 వేల కోట్ల నుంచి రూ.3.1 లక్షల కోట్లకు పెరగడం ఈ రంగం ఎంత వేగంగా విస్తరించిందో చూపిస్తోంది.
ఈ మార్పుకు ప్రధాన కారణం క్రెడిట్ కార్డులను కేవలం చెల్లింపుల సాధనంగా కాకుండా, రోజువారీ ఖర్చులు నిర్వహించడానికి, నగదు అవసరాలు తీర్చుకోవడానికి, వ్యక్తిగత రుణాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడమేనని నివేదిక అభిప్రాయపడింది. అంతేకాకుండా, గతంలో కేవలం క్రెడిట్ కార్డులపైనే ఆధారపడిన వినియోగదారులు ఇప్పుడు వ్యక్తిగత రుణాలు, కన్స్యూమర్ లోన్లు వంటి ఇతర అన్‌సెక్యూర్డ్ లోన్‌లను కూడా తీసుకుంటున్నారు. దీంతో ఒకే ఉత్పత్తిపై ఆధారపడే వారి వాటా 50 శాతం నుంచి 33 శాతానికి పడిపోయిందని నివేదిక వెల్లడించింది.
కొత్త సవాళ్లు
అయితే ఈ ధోరణి మరోవైపు ఆందోళనకర సంకేతాలను కూడా ఇస్తోంది. ఎక్కువ క్రెడిట్ కార్డులతో పాటు వ్యక్తిగత రుణాలు తీసుకున్న వినియోగదారుల్లో రుణ చెల్లింపుల్లో జాప్యం, డిఫాల్ట్ ప్రమాదం ఎక్కువగా కనిపిస్తున్నట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ పేర్కొంది. ముఖ్యంగా యువత, జెన్-జీ కస్టమర్లు చిన్న వయస్సులోనే ఎక్కువ క్రెడిట్ ఉత్పత్తులు ఉపయోగించడం ఆర్థిక సేవలకు యాక్సెస్ పెరిగిందనే సంకేతమే అయినప్పటికీ, బాధ్యతాయుతమైన రుణ వినియోగం, ఖర్చుల నియంత్రణపై అవగాహన కూడా అంతే అవసరమని నివేదిక స్పష్టం చేసింది. బ్యాంకులు కూడా ఇప్పుడు ఒక్క రుణం కాకుండా, వినియోగదారుడి మొత్తం క్రెడిట్ ప్రొఫైల్‌ను పరిశీలించి రుణాలు మంజూరు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.






