- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిధుల కొరతతో కుంటుపడిన అభివృద్ధి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసంపూర్తిగా వదిలేసిన పనుల వల్ల రహదారి అంతా దుమ్ముతో నిండిపోయి, ప్రయాణికులకు, స్థానికులకు నరకం చూపిస్తోంది.
అధికారుల నిర్లక్ష్యంపై కాంట్రాక్టర్ ఆవేదన
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు చేసిన పనులకు నిధులు విడుదల కాలేదని కాంట్రాక్టర్ వాపోయారు. బిల్లుల చెల్లింపు విషయంలో అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని, నిధులు రాకుండా పనులు ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిధుల విడుదల లేని కారణంగానే అనివార్యంగా పనులను నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డుపై ప్రయాణమంటేనే భయం!
ప్రస్తుతం రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది. వాహనాలు వెళ్తున్న ప్రతిసారీ దుమ్ము రేగి పరిసరాలు పొగమంచులా మారుతున్నాయి. ఈ దుమ్ము వల్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులు కంటి చూపు మందగించి ప్రమాదాలకు గురవుతుంటే, మరికొందరు శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దుమ్ము, ధూళి పీల్చడం వల్ల చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నిమ్మకు నీరెత్తినట్లు అధికారుల తీరు
ప్రజలు రోజూ పడుతున్న ఈ దుర్భర పరిస్థితులపై అధికార యంత్రాంగం ఏమాత్రం స్పందించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని, పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేసి, నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.






