- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం: సీపీఐ జిల్లా కార్యదర్శి పాషా
భద్రాచలంలో అంగన్వాడీల పాదయాత్ర ప్రారంభించారు.

దిశ, భద్రాచలం: అంగన్వాడీల హక్కుల సాధనకు రాజీలేని పోరాటాలే శరణ్యమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే షాబీర్ పాషా స్పష్టం చేశారు. చాలీచాలని వేతనాలు ఇస్తూ, మోయలేని పనిభారాన్ని మోపుతూ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వం బానిసలుగా చూస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేసి సచివాలయాన్ని ముట్టడిస్తామని పాషా హెచ్చరించారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ఆదివారం భద్రాచలంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ తో కలిసి సాబీర్ పాషా ప్రారంభించారు.అంబేద్కర్ సెంటర్లో జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ,అంగన్వాడీల సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నిత్యం సేవలందిస్తున్న అంగన్వాడీలపై సంబంధం లేని అదనపు విధులను మోపడం వెట్టిచాకిరీ చేయించడమేనన్నారు.
వెంటనే బకాయిలు చెల్లించాలి...
ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల పోరాటానికి సీపీఐ, ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం దిగిరాకుంటే వేలాది మంది అంగన్వాడీలతో సచివాలయాన్ని ముట్టడించి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. ఐసిడిఎస్ కు సరిపడా బడ్జెట్ కేటాయించాలని నెలకు 18 వేల వేతన హామీని నిలబెట్టుకోవాలని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బిఎల్ఓ విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని పదవీ విరమణ పొందిన వారికి బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు. రెండు రోజులపాటు సాగే పాదయాత్ర తొలి రోజు భద్రాచలం మీదుగా సారపాక బూర్గంపాడు పాల్వంచ మండలంలోని జగన్నాధపురం వరకు సాగింది.సోమవారం కలెక్టరేట్ ఎదుట వందలాదిమంది అంగన్వాడీలు అంగన్వాడీ వర్కర్ల తో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయి ఈశ్వరి, కార్యదర్శి నండూరి కరుణకుమారి, రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ సీతామహాలక్ష్మి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శులు సింగు నరసింహారావు, నరాటి ప్రసాద్, కల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






